- రచయితగా పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీ
- దర్శకుడిగాను ముందుకు వెళుతున్న వైనం
- 'కిక్' సినిమా ధైర్యాన్ని ఇచ్చిందని వెల్లడి
- తన కథలపై వస్తున్న విమర్శలపై స్పందన
వక్కంతం వంశీ మంచి రైటర్ అని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. చాలా హిట్ చిత్రాలకు ఆయన పనిచేశాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్' సినిమా, ప్రస్తుతం థియేటర్స్ లో ఉంది. తాజాగా 'ట్రీ మీడియా'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వక్కంతం వంశీ మాట్లాడుతూ, అనేక విషయాలను పంచుకున్నాడు.
'ఒకప్పుడు ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడ్డాను .. కాకపోతే ఇప్పుడు ఆ ఇబ్బందులు కాస్త తగ్గాయి అంతే. 'కిక్' సినిమా వరకూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నా పెళ్లి సమయంలోనే ఆ సినిమా విడుదలైంది. ఇక నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చు .. బ్రతకొచ్చు అనే ధైర్యాన్ని ఇచ్చింది. అప్పటివరకూ నా ప్రయాణం గాలివాటుగా వెళుతూ వచ్చింది" అని అన్నాడు.
"నా కథలను నేను సిద్ధం చేసుకుంటూ వెళుతున్నాను. అయినా ఇది ఫలానా సినిమాలోని సీన్ కదా అని అడుగుతూ ఉంటారు. ప్రపంచంలో లేని దానిని గురించి ఎవరూ ఊహించలేరు. ఉన్న దానిని తీసుకుని కొత్తగా ఎలా చెప్పాలి అనేది మాత్రమే చేయగలం. కావాలని చెప్పి నేను ఏదీ ఏ సినిమాలో నుంచి తీసుకోలేదు. ఒక్కోసారి కొన్ని సీన్స్ మధ్య పోలికలు ఉండొచ్చు" అని చెప్పాడు.