: రూపాయి చిక్కింది... ధరలు పెరిగేలా ఉన్నాయ్!
రూపాయి బక్క చిక్కుతోంది. ఫారెక్స్ మార్కెట్ల హెచ్చుతగ్గులతో భారీ కుదుపులకు లోనైన రూపాయి రోజు రోజుకూ దిగజారిపోతోంది. గత కొంత కాలంగా డాలర్ బలపడుతుండడంతో రూపాయి బలహీనపడింది. దీంతో 11 నెలల తరువాత భారీగా పతనమై 57 రూపాయలకు చేరింది. గతేడాది 54 రూపాయలుగా ఉన్న రూపాయి విలువ అమాంతం 56 కి దిగజారింది. దీంతో మొన్న తాజాగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. గత కొంత కాలంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. రూపాయి తాజా క్షీణతతో ధరలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. గత 4 సెషన్లుగా స్టాక్ మార్కెట్ నష్టపోతుండడంతో రూపాయిని మరింత కుంగదీసింది.
ఈ 4 రోజుల్లో ఎఫ్ఐఐలు 3,900 కోట్ల రూపాయల ఫ్యూచర్స్ అమ్మారు. దీంతో డాలర్ తో రూపాయి విలువ 57కి పతనమైంది. బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 నుంచి 8కి పెంచినా రూపాయి పతనం ఆగడం లేదు. రూపాయి మరింత పతనమైతే బంగారం, డీజిల్, పెట్రోలు, వంటగ్యాస్ ధరలు పెరుగుతాయి దాన్ని మించి విదేశీ విద్య మరింత భారమవుతుంది.