Raj Limbani: అండర్-19 ఆసియా కప్: లింబానీకి 7 వికెట్లు... నేపాల్ ను 52 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్
- దుబాయ్ లో అండర్-19 ఆసియా కప్
- నేడు భారత్ వర్సెస్ నేపాల్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
- నిప్పులు చెరిగిన రాజ్ లింబానీ... 22.1 ఓవర్లలో నేపాల్ ఆలౌట్
- 7.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన భారత కుర్రాళ్ల జట్టు
దుబాయ్ లో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ లో భారత్ స్ఫూర్తిదాయక విజయం సాధించింది. ఇటీవల పాకిస్థాన్ చేతిలో పరాజయం చవిచూసిన టీమిండియా కుర్రాళ్ల జట్టు నేడు నేపాల్ పై అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించింది. 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత యువ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. నేపాల్ ను 22.1 ఓవర్లలో 52 పరుగులకే కుప్పకూల్చింది. 18 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ రాజ్ లింబానీ 7 వికెట్లతో సంచలన బౌలింగ్ ప్రదర్శన నమోదు చేశాడు. లింబానీ నిప్పులు చెరిగే బంతులకు నేపాల్ బ్యాటర్ల వద్ద సమాధానం లేకపోయింది. నేపాల్ ఇన్నింగ్స్ లో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఆరాధ్య శుక్లా 2, ఆర్షిన్ కులకర్ణి 1 వికెట్ పడగొట్టారు.
ఇక, 53 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత అండర్-19 జట్టు కేవలం 7.1 ఓవర్లలోనే ఛేదించింది. ఛేదనలో భారత్ ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. ఓపెనర్లు అర్షిన్ కులకర్ణి 43, ఆదర్శ్ సింగ్ 13 పరుగులతో అజేయంగా నిలిచారు. అర్షిన్ 5 సిక్సులు కొట్టడం విశేషం.