Vishnu Vardhan Reddy: ఇది బ్యాంకు కాదు... రాహుల్ గాంధీ స్నేహితుడి ఇంటి లోపలి దృశ్యం: విష్ణువర్ధన్ రెడ్డి

Vishnu Vardhan Reddy satires in Dheeraj Sahu issue

  • ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నివాసంలో ఐటీ దాడులు
  • కట్టలు  కట్టలుగా డబ్బు... లెక్కించడానికి 50 మందికి పైగా సిబ్బంది
  • లభ్యమైన నగదు రూ.351 కోట్ల వరకు ఉంటుందని అంచనా

ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడుల్లో ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నివాసంలో కట్టల కొద్దీ డబ్బు బయటపడడం దేశంలో సంచలనం సృష్టించింది. సాహు నివాసంలో దొరికిన డబ్బు రూ.351 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ డబ్బును లెక్కించడానికి ఐటీ శాఖ 50 మందికి పైగా సిబ్బందిని రంగంలోకి దింపాల్సి వచ్చింది. అంతేకాదు, వారికి 40కి పైగా నగదు లెక్కింపు యంత్రాలను కూడా సమకూర్చింది. 

ఈ నేపథ్యంలో, ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. సాహు ఇంట్లో ఐటీ సిబ్బంది నోట్ల కట్టలను లెక్కిస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న విష్ణువర్ధన్ రెడ్డి... దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

"ఇది బ్యాంకు అనుకోకండి... కానే కాదు... ఇది రాహుల్ గాంధీ స్నేహితుడు, కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంటి లోపలి దృశ్యం" అని వివరించారు. 

కాగా, గాంధీల కుటుంబంతో ఎంపీ ధీరజ్ సాహు కుటుంబీకులకు సత్సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. సాహు కుటుంబానికి భారీ ఎత్తున మద్యం వ్యాపారం ఉంది. ఒడిశాలో ఎన్నో మద్యం డిస్టిలరీలకు సాహు కుటుంబీకులే యజమానులుగా ఉన్నారు. 

ధీరజ్ సాహు తండ్రి బల్ దేవ్ సాహు స్వాతంత్ర్య సమరయోధుడు. వారిది సంపన్న కుటుంబం. అప్పట్లోనే ఆయన భారత ప్రభుత్వానికి 47 కిలోల బంగారంతో పాటు రూ.47 లక్షల నగదు కూడా ఇచ్చారట.

More Telugu News