cough: బ్రిటన్ లో వంద రోజుల దగ్గు కలకలం.. అంటువ్యాధేనని నిపుణుల వార్నింగ్
- ఊపిరితిత్తులకు సంబంధించిన బ్యాక్టీరియానే కారణం
- ముక్కు కారడంతో మొదలవుతుందని వెల్లడి
- పిల్లలు, వృద్ధుల్లోనే ఎక్కువగా కనిపిస్తోందన్న వైద్యులు
బ్రిటన్ లో ఓ అంటువ్యాధి కలకలం రేపుతోంది. జనం దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. వంద రోజుల దగ్గు (కోరింత దగ్గు) వ్యాధిగా వ్యవహరిస్తున్న ఈ వ్యాధికి కారణం ఊపిరితిత్తుల బ్యాక్టీరియానేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. ఈ వ్యాధికి ఇప్పటికే వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, గర్భిణిలు ఈ టీకా తీసుకోవాలని చెప్పారు.
వంద రోజుల దగ్గు.. ముక్కు కారడంతో మొదలై రోజురోజుకూ గొంతు నొప్పి, దగ్గు తీవ్రమవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ జబ్బుతో గొంతులో పుండ్లు, చెవిలో ఇన్ఫెక్షన్లకు గురైన కేసులు కూడా బయటపడ్డాయని చెప్పారు. మూడు, నాలుగు నిమిషాల పాటు దగ్గు రావడం వల్ల పక్కటెముకలు విరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. యూకే వ్యాప్తంగా ఈ వంద రోజుల దగ్గు కేసులు గుర్తించినట్లు బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది. జులై నుంచి నవంబర్ మధ్య 716 మంది ఈ బ్యాక్టీరియా బారిన పడ్డారని పేర్కొంది. ఇప్పటికే వ్యాక్సిన్ అందుబాటులో ఉండడం వల్ల ఈ వ్యాధిని అరికట్టడం సాధ్యమేనని పేర్కొంది. వ్యాధి ప్రభావం తగ్గేంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలని బ్రిటన్ వాసులకు సూచించింది.