Komatireddy Venkat Reddy: హరీశ్ రావుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. తప్పులు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక

Komati Reddy fires on Harish Rao

  • మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన కోమటిరెడ్డి
  • తొమ్మిది ఫైళ్లపై సంతకాలు చేసిన మంత్రి
  • రెండు రోజులకే కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ విమర్శలు గుప్పిస్తున్నారని మండిపాటు

తెలంగాణ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలను స్వీకరించారు. ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా సచివాలయంలోని తన ఛాంబర్ లో బాధ్యతలను చేపట్టారు. సచివాలయంలోని 5వ అంతస్తులోని 11వ ఛాంబర్ లో బాధ్యతలను స్వీకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రిగా తన ఛైర్ లో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబసభ్యులు, సోదరుడు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అధికారులు పాల్గొన్నారు. మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే కొన్ని ఫైళ్లపై సంతకం చేశారు. 

ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ... మంత్రిగా బాధ్యతలను చేపట్టిన వెంటనే 9 ఫైల్స్ పై సంతకాలు చేశానని చెప్పారు. తనకు ఆర్ అండ్ బీ శాఖను కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. అసెంబ్లీ ఆవరణలో కొత్త కౌన్సిల్ హాల్ ను నిర్మించనున్నామని... ఆ బాధ్యతను ముఖ్యమంత్రి తనకు అప్పగించారని చెప్పారు. అసెంబ్లీలో గాంధీ విగ్రహం ముందున్న ఫెన్సింగ్ ను తీసేసి సుందరీకరణ పనులు చేపడతామని తెలిపారు. తన నియోజకవర్గం పరిధిలోని రోడ్లను రూ. 100 కోట్ల వ్యయంతో నాలుగు లైన్ల రోడ్లుగా మారుస్తామని చెప్పారు. 

రేపు తాను ఢిల్లీకి వెళ్తున్నానని... 14 రోడ్లను నేషనల్ హైవేలుగా గుర్తించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరుతానని కోమటిరెడ్డి తెలిపారు. ఎల్బీ నగర్ నుంచి మల్కాపురం వరకు, మల్కాపురం నుంచి సూర్యాపేట వరకు 6 లైన్ల రోడ్డు పనులు చేయాల్సి ఉందని చెప్పారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే... ఏం చేశారంటూ మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ చేసిందేముందని ప్రశ్నించారు. రహదారులపై శ్రద్ధ పెట్టలేదని దుయ్యబట్టారు. తాము ఎవరి మీద కక్ష సాధింపులకు పాల్పడమని... తప్పులు ఉంటే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు.

Komatireddy Venkat Reddy
Congress
Harish Rao
BRS
  • Loading...

More Telugu News