Raghu Rama Krishna Raju: సీఎం గారు తన అజ్ఞానాన్నే విజ్ఞానంగా భావిస్తున్నారు: సెటైర్ల వర్షం కురిపించిన రఘురామ

Raghu Rama Krishna Raju satires on CM Jagan

  • సోషల్ మీడియాలో సీఎం జగన్ వీడియోలు వైరల్
  • పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా అనడంపై సెటైర్లు
  • సీఎం పేలవ ప్రదర్శన పట్ల జనం నెత్తీనోరు కొట్టుకుంటున్నారన్న రఘురామ
  • సలహాదారులు ఈ మాత్రం కూడా నేర్పించలేకపోయారా అంటూ ఎద్దేవా

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఏపీ సీఎం జగన్ పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా అంటున్న వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే విపక్షాలు దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. తాజాగా ఈ అంశంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా స్పందించారు. సీఎం జగన్ పై తనదైన శైలిలో వ్యంగ్యం కురిపించారు. 

సీఎం జగన్ ప్రతిసారి తాను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నని చెబుతుంటారని, బహుశా ఆయన ఫస్ట్ క్లాసే చదివారేమో అంటూ సెటైర్ వేశారు. కనీసం ఒకటో తరగతి పాస్ కాని వాళ్లకు కూడా ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియకుండా ఉంటుందా? అని రఘురామ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పైగా, ఆ విషయం తెలియకపోవడం కూడా తన గొప్పదనం లాగా "ఏంటదీ బంగాళా... బంగాళాదుంపా" అంటూ నవ్వుతూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 

తన అజ్ఞానాన్ని కూడా విజ్ఞానంగా భావిస్తూ ఆయన చేసే పేలవ ప్రదర్శన చూసి జనాలు నెత్తి నోరు బాదుకుంటున్నారని రఘురామ పేర్కొన్నారు. ఎక్కడ చూసినా ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియని ముఖ్యమంత్రి అనే వార్తలే తప్ప మరో వార్త కనిపించడంలేదని అన్నారు. సలహాదారులు ఆ మాత్రం కూడా నేర్పించలేకపోయారా అనే బాధ కలుగుతోందని తెలిపారు. 

మూడో క్లాసు నుంచే టోఫెల్ పరీక్షలు, నీకు స్పానిష్ నేర్పిస్తాను, నీకు ఇంగ్లీష్ నేర్పిస్తాను, జర్మన్ నేర్పిస్తాను అని సీఎం అంటుంటే... ముందు ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా ఏంటో నువ్వు తెలుసుకోరా బాబూ అంటూ ప్రజల చేత చెప్పించుకునే స్థితికి చేరుకోవడం చాలా దురదృష్టకరమని రఘురామ వ్యాఖ్యానించారు.

Raghu Rama Krishna Raju
CM Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News