Vladimir Putin: ప్రధాని మోదీని ఎవరూ భయపెట్టలేరు: రష్యా అధ్యక్షుడు పుతిన్
- ప్రజాప్రయోజనాల కోసం మోదీ కఠిన నిర్ణయాలకు వెనకాడరన్న పుతిన్
- మోదీ శైలి తననూ ఒక్కోసారి ఆశ్చర్యపరుస్తుందని వ్యాఖ్య
- జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోమని మోదీని ఎవరూ ఒత్తడి చేయలేరని వ్యాఖ్య
భారత ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజాప్రయోజనాల కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు మోదీ వెనకాడరని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య అన్ని రంగాల్లో బలోపేతమవుతున్న సంబంధాల గురించి పుతిన్ ఓ చర్చా కార్యక్రమంలో మట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను రష్యా ప్రభుత్వ టెలివిజన్ ఆర్‌టీ న్యూస్ నెట్టింట పంచుకుంది.
జాతీయ భద్రత విషయంలో మోదీ నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న తీరు తనకు ఆశ్చర్యం కలిగిస్తుందని పుతిన్ పేర్కొన్నారు. ‘‘నిజం చెప్పాలంటే ఒక్కోసారి నేను కూడా మోదీ ప్రజాప్రయోజనాల దృష్ట్యా తీసుకునే నిర్ణయాలు చూసి ఆశ్చర్యపోతుంటా’’ అని అన్నారు.
‘‘జాతి, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోవాలంటూ మోదీని ఎవరు బలవంతం పెట్టలేరు, బెదిరించలేరు. అయితే, ఆయనపై అలాంటి ఒత్తిడులు ఉన్నాయని మాత్రం నాకు తెలుసు’’ అని పుతిన్ పేర్కొన్నారు. కాగా, గత నెలలో వర్చువ్ జీ20 సమ్మిట్‌లో కూడా పుతిన్ మోదీని పొగడ్తల్లో ముంచెత్తారు.