Article 370: ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై డిసెంబర్ 11న ‘సుప్రీం’ తీర్పు

Supreme Court to deliver verdict on abrogation of Article 370 on December 11

  • 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం
  • ఈ చర్యను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్ల దాఖలు
  • 16 రోజుల పాటు సాగిన విచారణ, అనంతరం సెప్టెంబర్‌లో తీర్పు రిజర్వు
  • సోమవారం తీర్పు వెలువరించనున్న సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు డిసెంబర్ 11న తీర్పు వెలువరించనుంది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో..జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, సూర్య కాంత్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరిస్తుంది. సెప్టెంబర్‌లో ఈ పిటిషన్లపై విచారణ ముగియడంతో సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. 

మొత్తం 16 రోజుల పాటు ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి, సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, రాకేశ్ ద్వివేదీ, వి. గిరి వాదనలు వినిపించారు. జమ్మూ కశ్మీర్ కాంస్టిట్యూయెంట్ అసెంబ్లీ రద్దు తరువాత ఆర్టికల్ 370 శాశ్వతమైనదిగా మారిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. రాజ్యాంగ సవరణలకు అవకాశం కల్పించే ఆర్టికల్ 368 ద్వారా ఆర్టికల్ 370ని రద్దు చేయలేమని స్పష్టం చేశారు. 

ఈ వాదనలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆర్టికల్ 370 తాత్కాలికమైన అధీకరణ అని పేర్కొంది. జమ్మూకశ్మీర్‌ను దేశంలో పూర్తిగా ఐక్యం చేసేందుకు ఆర్టికల్ 370 రద్దు అనివార్యమైన ఆఖరి చర్య అని చెప్పుకొచ్చింది. ప్రత్యేకహోదా తొలగింపు తరువాత కశ్మీర్‌లో చోటుచేసుకున్న సానుకూల పరిణామాలు కూడా కోర్టు ముందుంచింది. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది. 

2019 ఆగస్టు 5న బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూకశ్మీర్‌‌కు అసెంబ్లీ ఉన్నా లడఖ్ మాత్రం శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News