Las vegas University: అమెరికాలో కాల్పుల మోత.. వేర్వేరు ఘటనల్లో పది మంది మృతి
- లాస్ వెగాస్‌లో కాల్పులకు పాల్పడ్డ దుండగుడు.. ముగ్గురి మృతి..
- టెక్సాస్‌లోని ఆస్టిన్, శాన్ ఆంటోనియో నగరాల్లో కాల్పుల కలకలం
- అనుమానితుడు కూడా మరణించినట్టు పోలీసుల ప్రకటన
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. లాస్ వెగాస్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని, స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు వెల్లడించారు. బుధవారం లాస్ వెగాస్ యూనివర్సిటీలో ఈ కాల్పులు జరిగాయని చెప్పారు. కాగా కాల్పులకు తెగబడ్డ అనుమానితుడు కూడా చనిపోయినట్టు ప్రకటించారు. ఈ మేరకు లాస్ వెగాస్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది.
టెక్సాస్‌లోని రెండు నగరాల్లో కాల్పులు...
టెక్సాస్‌లోని ఆస్టిన్, శాన్ ఆంటోనియో నగరాల్లో బుధవారం కాల్పుల కలకలం రేగింది. ఈ రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు పోలీసు అధికారులు సహా ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. శాన్ ఆంటోనియోలోని పోర్ట్ రాయల్ స్ట్రీట్ 6400 బ్లాక్ సమీపంలోని ఓ ఇంటి వద్ద 50 ఏళ్ల వయసున్న ఒక పురుషుడు, మహిళ మృతదేహాలను గుర్తించామని బెక్సర్ కౌంటీ పోలీసు అధికారి జేవియర్ సలాజర్ వెల్లడించారు. ఆస్టిన్‌లో వరుస కాల్పులకు ముందు అనుమానితుడు వీరిద్దరిపై కాల్పులు జరిపి ఉంటాడని అన్నారు. ఆస్టిన్‌లో కాల్పులకు పాల్పడ్డ నిందితుడికి పోర్ట్ రాయల్ స్ట్రీట్‌లో జరిగిన కాల్పులతో సంబంధం ఉందని అనుమానిస్తున్నట్టు చెప్పారు.
34 ఏళ్ల షేన్ జేమ్స్ అనే వ్యక్తి ఈ కాల్పులకు బాధ్యుడని ఆస్టిన్ పోలీసులు అనుమానిస్తున్నారు. పోర్ట్ రాయల్ స్ట్రీట్ ఘటనతో సంబంధం ఉందని అనుమానిస్తున్నామంటూ బెక్సర్ కౌంటీ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు వెల్లడించారు. దీంతో అమెరికాలో బుధవారం వేర్వేరు కాల్పుల ఘటనల్లో మొత్తం 10 మంది మృత్యువాతపడ్డట్టయింది.