bandla ganesh: రేవంత్ రెడ్డి అంగీకరిస్తే సినిమా తీస్తాను... ఆయనకు ఎంతోమంది విలన్‌లు ఉన్నారు: బండ్ల గణేశ్

Bandla Ganesh Ready to produce film on Revanth Reddy

  • రేవంత్ విలన్లు ఆయనను జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారన్న గణేశ్ 
  • ఇబ్బంది ఎదుర్కొన్న చోటనే ఆయన నాయకుడిగా ఎదిగారని కితాబు
  • అందుకే రేవంత్ రెడ్డి సీఎం అవుతారని ముందే చెప్పానని వెల్లడి

రేవంత్ రెడ్డి అంగీకరిస్తే ఆయన కథతో సినిమాను తీస్తానని ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ అన్నారు. బుధవారం ఏబీఎన్ లైవ్ డిబేట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రేవంత్ రెడ్డికి ఎంతోమంది విలన్‌లు ఉన్నారని, వారంతా ఆయనను జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్బంది ఎదుర్కొన్న చోటనే ఆయన నాయకుడిగా ఎదిగారన్నారు. ఇప్పుడు అధికారం చేపడుతున్నారని కితాబునిచ్చారు. రేవంత్‌కు ఆకలి, కసి, కష్టం, పాలన తెలుసునని చెప్పారు. తెలంగాణలోని వివిధ జిల్లాలలో విజయం సాధించిన కాంగ్రెస్‌ గ్రేటర్ పరిధిలో ఒక్క సీటు గెలవకపోవడం బాధించిందన్నారు.

రానున్న ఎన్నికల్లో హైదరాబాద్‌లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అద్భుత పాలన చేస్తుందని.. హైదరాబాద్ వాసులు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ మాత్రమే కాకుండా తెలంగాణవ్యాప్తంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఎక్స్ వేదికపై కేటీఆర్ గన్ పట్టుకుని ఉన్న ఫోటో చూసి భయపడ్డానని... కౌంటింగ్ కేంద్రాల దగ్గర అలర్టుగా ఉండమని కార్యకర్తలకు చెప్పానన్నారు.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ముందే చెప్పిన బండ్ల గణేశ్ 

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని తాను నెల రోజుల క్రితమే చెప్పానని బండ్ల గణేశ్ అన్నారు. రేవంత్ సీఎం అవుతారని ముందే ఎలా చెప్పారు? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ... పోరాడేవారికి ఎవరైనా కత్తిని ఇస్తారని, కత్తి ఇచ్చిన వారికే కిరీటం కూడా ఇస్తారన్నారు. ఇది పెద్ద లాజిక్ ఏమీ కాదన్నారు. రేవంత్ కష్టపడిన తీరును చూసి ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందని బలంగా నమ్మినట్లు చెప్పారు. రేవంత్ నేతృత్వంలో పార్టీ బలంగా పని చేస్తుందన్నారు. తాను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ సభ్యుడినేనని, కానీ ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్నందున ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉన్నానని చెప్పారు. తాను 2004 నుంచి కాంగ్రెస్ వాదినేనని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఆనందంగా ఉందన్నారు.

bandla ganesh
Telangana
Congress
  • Loading...

More Telugu News