Kohli: కోహ్లీ రెస్టారెంట్ సిబ్బంది తీరుపై విమర్శలు.. వీడియో ఇదిగో!
- పంచెతో వెళితే లోపలికి అనుమతించని సిబ్బంది
- వీడియో తీసి ట్వీట్.. వైరల్ గా మారిన వీడియో
- తమిళ సంప్రదాయ దుస్తులు ధరించినట్లు వెల్లడి
ముంబైలోని కోహ్లీ రెస్టారెంట్ వివాదంలో చిక్కుకుంది. అక్కడి సిబ్బంది తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమిళ సంప్రదాయ దుస్తులతో వచ్చిన ఓ కస్టమర్ ను రెస్టారెంట్ లోకి అనుమతించకపోవడమే దీనికి కారణం.. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో బాధితుడు వెల్లడించిన వివరాల ప్రకారం..
జుహూ ఏరియాలోని ‘వన్ 8 కమ్యూన్’ రెస్టారెంట్ కు తమిళనాడుకు చెందిన యువకుడు ఒకరు వెళ్లారు. తమ సంప్రదాయం ప్రకారం తెల్ల చొక్కా, తెల్ల పంచె ధరించి వెళ్లడంతో రెస్టారెంట్ సిబ్బంది అతడిని ఆపేశారు. లోపలికి అనుమతించలేమని, వేరే రెస్టారెంట్ కు వెళ్లాలని సూచించారు. ఎందుకు అనుమతించరని అడిగితే.. వస్త్రధారణ తమ రూల్స్ కు అనుగుణంగా లేదన్నారని బాధితుడు చెప్పాడు. తన డ్రెస్సింగ్ హుందాగానే ఉందని, పైగా అది తమ సంప్రదాయమని చెప్పినా వినిపించుకోలేదన్నాడు. దీంతో రెస్టారెంట్ సిబ్బంది తీరును నిరసిస్తూ అక్కడే ఓ వీడియో తీసి ట్వీట్ చేశాడు. తనకు ఎదురైన అవమానం రించి ఆ వీడియోలో వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.