Trains: కాజీపేట- విజయవాడ మార్గంలో పలు రైళ్ల రద్దు
- వారం రోజుల పాటు వివిధ సర్వీసులను రద్దు చేసిన రైల్వే
- మరికొన్ని రైళ్లను కాజీపేట వరకే కుదించిన అధికారులు
- వరంగల్ లో కొనసాగుతున్న మూడో లైన్ పనులే కారణం
కాజీపేట-వరంగల్ మధ్య రైల్వే మూడో లైన్ పనులు కొనసాగుతుండడంతో పలు రైళ్లను వారం పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. రైల్వే లైన్ పనుల కారణంగా కాజీపేట-విజయవాడ మధ్య నడిచే గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్ సిటీ, లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్లే గౌతమి ఎక్స్ ప్రెస్ లను ఈ నెల 10 నుంచి 18 వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. శాతవాహన ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 7 వ తేదీ రద్దు చేయడంతో పాటు 10 వ తేదీ నుంచి ఈ నెల 18 వరకు రద్దు చేస్తున్నట్లు వివరించారు.
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్, భద్రాచలం రోడ్ మధ్య నడిచే కాకతీయ ఎక్స్ ప్రెస్ ఈ నెల 6 వ తేదీ రద్దు.. ఈ నెల 10 నుంచి 18 వరకు నిలిపేస్తారు. ఆదిలాబాద్- తిరుపతి కృష్ణా ఎక్స్ ప్రెస్ ఈ నెల 5 నుంచి 19వ తేదీ వరకు రద్దయింది. కాజీపేట- డోర్నకల్, డోర్నకల్ - విజయవాడ మధ్య తిరిగే పుష్ ఫుల్ రైళ్లను ఈ నెల 10 వ తేదీ నుంచి 18 వరకు రద్దు చేశారు. గోల్కొండ ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 11 నుంచి 19 వ తేదీ వరకు కాజీపేట వరకు మాత్రమే నడపనున్నారు. భద్రాచలం రోడ్ నుంచ బల్లార్షా వెళ్లే సింగరేణి ఎక్స్ ప్రెస్ ఈ నెల 6 నుంచి 8 వరకు, మళ్లీ 10 నుంచి 19వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.