Komatireddy Venkat Reddy: పీసీసీ అధ్యక్షుడు కాబట్టే రేవంత్ రెడ్డిని డీజీపీ కలిశారు: కోమటిరెడ్డి

Komatireddy reacts on DGP meeting with Revanth Reddy

  • తెలంగాణలో కాంగ్రెస్ జోరు
  • ఇప్పటికే 20 స్థానాలు కైవసం... మరో 44 స్థానాల్లో ఆధిక్యం
  • రేవంత్ రెడ్డిని కలిసిన డీజీపీ, ఇతర ఐపీఎస్ అధికారులు
  • సీఎం అభ్యర్థి ఎవరన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసి నిర్ణయిస్తారన్న కోమటిరెడ్డి
  • తాను సీఎం రేసులో ఉన్నానా, లేదా అనేది అప్రస్తుతం అని వెల్లడి

తెలంగాణలో హస్తం దూసుకుపోతోంది. ప్రభుత్వం ఏర్పాటు దిశగా స్పష్టమైన మెజారిటీ అందుకుంటోంది. ఇప్పటికే 20 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, మరో 44 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ అగ్రనేతలందరూ దాదాపుగా గెలిచారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ లో నెగ్గి, కామారెడ్డిలోనూ ముందంజలో ఉన్నారు. 

కాంగ్రెస్ విజయపరంపర నేపథ్యంలో, రేవంత్ రెడ్డిని డీజీపీ అంజనీ, సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ భగవత్ కలిశారు. రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పరిణామంతో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డేనన్న వాదనలకు బలం చేకూరుతోంది. దీనిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. 

సీఎం అభ్యర్థి ఎవరన్నది తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రి పదవి కోసం రేసులో ఉన్నానా, లేదా? అనే అంశం చర్చించడానికి ఇది సమయం కాదని అన్నారు. పీసీసీకి అధ్యక్షుడుగా ఉన్నారు కాబట్టే రేవంత్ రెడ్డిని డీజీపీ కలిశాడని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ విజయాన్ని సోనియా గాంధీకి పుట్టినరోజు కానుకగా ఇస్తున్నామని తెలిపారు. 

కాగా, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ కు చెందిన కంచర్ల భూపాల్ రెడ్డిపై కోమటిరెడ్డి 50 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Komatireddy Venkat Reddy
Revanth Reddy
Congress
Telangana Assembly Results
  • Loading...

More Telugu News