Mayank: కౌన్ బనేగా కరోడ్ పతి: కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పిన 14 ఏళ్ల బాలుడు
- జాతీయ స్థాయిలో బిగ్గెస్ట్ గేమ్ షోగా పేరుతెచ్చుకున్న కేబీసీ
- కేబీసీలో బాలల కోసం ప్రత్యేక పోటీ
- అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన హర్యానా బాలుడు మయాంక్
- అయితే రూ.7 కోట్ల ప్రశ్నకు సమాధానం చెప్పలేక క్విట్ అయిన వైనం
జాతీయ స్థాయిలో అత్యంత ప్రజాదరణ పొందిన బుల్లితెర గేమ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ). కోటి రూపాయల బహుమతి కావడంతో ఈ పోటీలో పాల్గొనాలని అందరూ ఉవ్విళ్లూరుతుంటారు. పైగా, ఈ గేమ్ షోకి వ్యాఖ్యాతగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తుండడం ముఖ్యమైన అంశం.
ఈ గేమ్ షోలో వివిధ దశల్లో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో దశ దాటే కొద్దీ నగదు బహుమతి పెరగడమే కాకుండా, ప్రశ్నలు కూడా కఠినంగా ఉంటాయి. ఇక కోటి రూపాయల ప్రశ్న అయితే చెప్పనక్కర్లేదు. కంటెస్టెంట్ మేధస్సుకు, జ్ఞాపకశక్తికి పదును పెట్టేలా ఉండడమే కాదు, కొన్నిసార్లు తికమకకు గురిచేస్తుంది. అలాంటి క్లిష్టమైన ప్రశ్నకు ఓ 14 ఏళ్ల బాలుడు సమాధానం చెప్పి కోటి రూపాయలు గెలుచుకుని వెళ్లాడు. ఆ అబ్బాయి పేరు మయాంక్.
కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో జూనియర్స్ స్పెషల్ నిర్వహించగా, మయాంక్ అన్ని ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పాడు. చివరగా... "కొత్తగా కనుగొన్న ఖండానికి అమెరికా అని నామకరణం చేసి, మ్యాప్ ను రూపొందించిన యూరోపియన్ క్వాట్రోగ్రాఫర్ ఎవరు?" అంటూ అమితాబ్ బచ్చన్ కోటి రూపాయల ప్రశ్నను సంధించారు.
ఆ ప్రశ్నకు సమాధానాలుగా కొన్ని ఆప్షన్లు ఇచ్చారు. ఆ నాలుగు ఆప్షన్లలో ఒకటైన 'మార్టిన్ వాల్డీ ముల్లర్' అనే సమాధానాన్ని ఎంచుకున్న మయాంక్ విజేతగా నిలిచాడు. తద్వారా ఈ కార్యక్రమంలో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి జూనియర్ కంటెస్టెంట్ గా చరిత్ర సృష్టించాడు. అయితే, రూ.7 కోట్ల ప్రశ్నకు కూడా సమాధానం చెప్పేందుకు ప్రయత్నించిన ఈ కుర్రాడు... చివరకు షో నుంచి తప్పుకున్నాడు.
మయాంక్ స్వస్థలం హర్యానాలోని మహేంద్రగఢ్. ఈ బాలుడు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాడు. తమ రాష్ట్రానికి చెందిన బాలుడు కౌన్ బనేగా కరోడ్ పతిలో కోటి రూపాయలు గెలుచుకోవడం పట్ల హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ హర్షం వ్యక్తం చేశారు. 'జీనియస్' అంటూ బాలుడ్ని అభినందించారు.