- ఇషాన్ తప్పిదంతో ఆసీస్ చేతుల్లోకి మ్యాచ్
- వేడ్‌ను స్టంప్ అవుట్ చేసే క్రమంలో వికెట్ల కన్నా ముందుకు
- ఐసీసీ నిబంధనల ప్రకారం నోబాల్ ప్రకటించిన అంపైర్
- ఫ్రీహిట్‌లో సిక్స్ కొట్టి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన వేడ్
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గత రాత్రి గువాహటిలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. 222 పరుగుల భారీ స్కోరు సాధించి ఒక దశలో గెలుపు బాటలో ఉన్న టీమిండియా ఎందుకు ఓడిందన్న దానిపై సమాధానం దొరికింది. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చేసిన చిన్న తప్పిదమే భారత్ కొంప ముంచింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలుపునకు చివరి 9 బంతుల్లో 33 పరుగులు అవసరం కావడం భారత్ గెలుపు తథ్యమనే అనుకున్నారంతా.
అక్షర్ పటేల్ వేసిన 19వ ఓవర్ నాలుగో బంతిని మాథ్యూ వేడ్ ముందుకొచ్చి ఆడే ప్రయత్నం చేశాడు. బంతి మిస్సై ఇషాన్ కిషన్ చేతిలో పడడం, ఆ వెంటనే స్టంపింగ్ చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే, రీప్లేలో అది నాటౌట్‌గా తేలింది. అక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే భారత్ కొంప మునిగే పని జరిగింది.
బంతిని అందుకునే క్రమంలో ఇషాన్ గ్లోవ్స్ స్టంప్స్ కన్నా ముందుకు రావడంతో అంపైర్ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించి ఫ్రీ హిట్ ఇచ్చాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం బౌలర్ బంతి వేసిన తర్వాత వికెట్ల వెనకాలే ఉండాలి. కానీ, ఇషాన్ గ్లోవ్స్ స్టంప్స్ కన్నా ముందుకు రావడంతో అది నోబాల్ అయింది. ఫ్రీహిట్ బంతికి వేడ్ రెచ్చిపోయాడు. ఫ్రీహిట్‌ను సద్వినియోగం చేసుకుంటూ సిక్స్ కొట్టడంతో మ్యాచ్ ఒక్కసారిగా పర్యాటక జట్టు చేతిలోకి వెళ్లి భారత్ ఓటమి ఖాయమైంది. అలాగే, అదే ఓవర్ చివరి బంతికి బైస్ రూపంలో మరో నాలుగు పరుగులు రావడంతో ఆస్ట్రేలియా శిబిరంలో సంబరాలు చేసుకున్నారు.
చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 21 పరుగులు అవసరం కాగా జోరుమీదున్న మ్యాక్స్‌వెల్ అలవోకగా బాదేసి జట్టుకు విజయాన్ని అందించిపెట్టాడు. అయితే, మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండడంతో సిరీస్‌పై భారత్ ఆశలు సజీవంగా ఉన్నాయి.