Silkyara Tunnel: సిల్క్యారా టన్నెల్ వద్ద ఆలయ నిర్మాణం: ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి
- ఒక్కో కార్మికుడికి రూ.1 లక్ష ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం
- 15-30 రోజులపాటు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాల్సిందిగా కంపెనీని కోరతామన్న ధామి
- కార్మికులు కోలుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ
ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమవ్వడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 17 రోజులపాటు సొరంగంలో ధైర్యంగా ఉన్న 41 మంది కార్మికులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రెస్క్యూ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి రెస్క్యూ అనంతరం కీలక ప్రకటన చేశారు. సురక్షితంగా బయటపడ్డ ఒక్కో కార్మికుడికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ సాయాన్ని అందజేస్తుందని చెప్పారు. కార్మికులు కోలుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఆర్థిక సాయానికి అదనంగా కార్మికులకు 15-30 రోజులపాటు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని కంపెనీని కోరతామని చెప్పారు.
ఇక సిల్క్యారా సొరంగం ముఖద్వారం వద్ద ‘బాబా బైద్యనాథ్' ఆలయాన్ని నిర్మించాలని భావిస్తున్నట్టు సీఎం ధామి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ దశలో ఉన్న అన్ని సొరంగాల నిర్మాణ పనులను సమగ్రంగా సమీక్షించనున్నట్టు ఆయన తెలిపారు. కాగా సొరంగం నుంచి 41 మంది కార్మికులు క్షేమంగా బయటపడడంపై సీఎం ధామి హర్షం వ్యక్తం చేశారు. 17 రోజులపాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌కు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా ‘ర్యాట్ హోల్ మైనింగ్’ బృందాన్ని అభినందించారు. కార్మికులను రక్షించడంలో ఈ బృందం కీలక పాత్ర పోషించిందని అన్నారు. కార్మికులు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, వైద్యుల అంచనాల ఆధారంగా తదుపరి నిర్ణయం ఆధారపడి ఉంటుందని రెస్క్యూ అనంతరం సీఎం ధామి పేర్కొన్నారు.