Jagdeep Dhankhar: మోదీని మహాత్మాగాంధీతో పోల్చిన ఉప రాష్ట్రపతి.. ఇంతకుమించి సిగ్గులేనితనం మరోటి ఉండదన్న కాంగ్రెస్

VP Jagdeep Dhankhar compares PM Modi to Mahatma Gandhi

  • మహాత్మాగాంధీ గత శతాబ్దపు మహాపురుషుడైతే.. మోదీ ఈ శతాబ్దపు యుగపురుషుడన్న జగదీప్ ధన్‌ఖర్
  • ముఖస్తుతికీ ఓ హద్దు ఉంటుందన్న మాణికం ఠాగూర్
  • స్థాయిని మరిచి భజనపరుడిగా మారడం అవమానకరమన్న కాంగ్రెస్ నేత
  • ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించిన బీఎస్పీ ఎంపీ 

ప్రధానమంత్రి నరేంద్రమోదీని మహాత్మాగాంధీతో పోలుస్తూ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇంతకుమించి సిగ్గుచేటైన విషయం మరోటి ఉండదని తూర్పారబట్టింది. జైన ఆధ్యాత్మికవేత్త, తత్వవేత్త రాజ్‌చంద్రాజీని స్మరించుకుంటూ నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ ఈ శతాబ్దపు మహాపురుషుడని, ప్రధాని నరేంద్రమోదీ ఈ శతాబ్దపు యుగపురుషుడని అభివర్ణించారు. బానిస సంకెళ్ల నుంచి మహాత్మాగాంధీ మనల్ని విముక్తులను చేస్తే, ప్రధాని మోదీ దేశాన్ని ప్రగతి పథంలో నడుపుతున్నారని కొనియాడారు. వీరిద్దరూ శ్రీమద్ రాజ్‌చంద్రాజీ స్ఫూర్తిని, బోధనలను ప్రతిబింబిస్తున్నారని ప్రశంసించారు.

జగదీప్ ధన్‌ఖర్ పోలికపై కాంగ్రెస్ విరుచుకుపడింది. ఆ పార్టీ నేత మాణికం ఠాగూర్ మాట్లాడుతూ.. ఇంతకుమించి సిగ్గులేనితనం ఇంకోటి ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ చేశారు. ‘‘ప్రధాని మోదీని మహాత్మాగాంధీతో పోల్చడం సిగ్గుచేటు సర్. వ్యక్తి పూజ (ముఖస్తుతి) కు కూడా ఓ హద్దు ఉంటుంది. మీరిప్పుడు అది దాటిపోయారు. మీ స్థాయిని మరిచి భజనపరుడిగా మారడం అవమానకరం. ఇలాంటి వ్యాఖ్యలు మీ కుర్చీ (పదవి)కి విలువను జోడించవు సర్’’ అని విరుచుకుపడ్డారు. 

బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎంపీ డానిష్ అలీ కూడా ధన్‌ఖర్ వ్యాఖ్యలపై స్పందించారు. కొత్తశకం ప్రారంభం కావడం నిజమేనని, ఓ నిర్దిష్ట వర్గానికి చెందిన ఎంపీని దూషించేందుకు పార్లమెంటులో అనుమతినివ్వడం ద్వారా ప్రధాని నిజంగానే కొత్తశకాన్ని ప్రారంభించారని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News