Hamas: మరో 11 మంది బందీలను విడుదల చేసిన హమాస్

Hamas released 11 more hostages and handed over to Israel

  • మానవతా సంధి రెండు రోజులపాటు పొడిగింపు నేపథ్యంలో విముక్తి
  • ప్రతిగా 33 మంది పాలస్తీనా ఖైదీలను అప్పగించిన ఇజ్రాయెల్
  • సంధి పొడిగింపుపై హర్షం వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

హమాస్-ఇజ్రాయెల్ మధ్య సంధిని మరో రెండు రోజులపాటు పొడిగించారనే వార్తల నేపథ్యంలో మరో 11 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. వాస్తవానికి మంగళవారంతో సంధి ముగియాల్సి ఉంది. కానీ, మరో 48 గంటలు పొడిగించేందుకు ఒప్పందం కుదిరిందని హమాస్ ప్రకటించింది. ఇక సంధి పొడిగింపు పరిణామంపై ఐక్యరాజ్య సమితి హర్షం వ్యక్తం చేసింది. యుద్ధం అనే అంధకారం నడుమ ఇదొక ఆశ, మానవత్వపు మెరుపు లాంటిదని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అభివర్ణించారు. 

విడుదలైన 11 మంది బందీలు వారి కుటుంబాలను కలిసే వరకు తమ సైన్యం వారి వెంటే ఉంటుందని ఇజ్రాయెల్ మిలటరీ పేర్కొంది. బందీల విడుదలను నిర్ధారించిన కొద్దిసేపటికే 33 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసినట్లు ఇజ్రాయెల్ జైలు అధికారులు తెలిపారు. రాత్రి సమయంలో ఖైదీలను విడుదల చేసినట్టు మంగళవారం తెల్లవారుజామున ప్రకటన చేశారు. దీంతో సంధి సమయంలో ఇజ్రాయెల్ విడుదల చేసిన మొత్తం ఖైదీల సంఖ్య 150కి చేరింది.

కాగా సంధి పొడిగింపునకు ఖతార్ మధ్యవర్తిత్వం వహించింది. ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మజేద్ అల్ అన్సారీ సంధి పొడిగింపు ప్రకటన చేశారు. గాజా స్ట్రిప్‌లో అదనంగా మరో రెండు రోజుల పాటు మానవతా సంధి పొడిగింపునకు ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. అమెరికా, ఈజిప్ట్ మద్ధతుతో ఈ మేరకు సంప్రదింపులు జరిపినట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News