Student Visa: విద్యార్థి వీసాలకు కొత్త రూల్స్ తీసుకువచ్చిన అమెరికా

US introduces new rules for student visas

  • విద్యార్థులకు ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమెరికా
  • భారత్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో అమెరికాకు విద్యార్థులు
  • వీసా దరఖాస్తుల్లో మోసాలు అరికట్టేందుకు కొత్త నిబంధనలు

నాణ్యమైన విద్య, దాంతోపాటే ఉపాధి లభిస్తుందన్న కారణంగా అనేక దేశాల విద్యార్థులు అమెరికాకు తరలి వెళుతుంటారు. అయితే, అమెరికా ప్రభుత్వం ప్రతిభావంతులకే తమ విద్యాసంస్థల్లో అవకాశం కల్పిస్తుంటుంది. భారత్ నుంచి కూడా ఏటా పెద్ద సంఖ్యలో విద్యార్థులు అమెరికా వెళుతుంటారు. 

కాగా, స్టూడెంట్ వీసాల కోసం అమెరికా కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఎమ్, ఎఫ్, జే కేటగిరీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు మారిన నిబంధనలను గమనించాలని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. కొత్త నిబంధనలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. 

తాజా నిబంధనలు ఇవే...

  • స్టూడెంట్ వీసా కోరుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లో తమ ప్రొఫైల్ క్రియేట్ చేసుకునేటప్పుడు, అపాయింట్ మెంట్ బుక్ చేసుకునేటప్పుడు సొంత పాస్ పోర్టులో ఉన్న సమాచారాన్నే పొందుపరచాలి. తప్పుడు సమాచారం ఇస్తే వారి దరఖాస్తును తిరస్కరిస్తారు. వారి అపాయింట్ మెంట్ రద్దవడమే కాదు, వీసా ఫీజులు కూడా నష్టపోతారు.

  • తప్పుడు పాస్ పోర్టు నెంబరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని, దరఖాస్తు తిరస్కరణకు గురైన వారు... తిరిగి సరైన పాస్ పోర్టు నెంబరుతో కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడంతో పాటు, మళ్లీ అపాయింట్ మెంట్ షెడ్యూల్ చేసుకోవాలి. అంతేకాదు, మళ్లీ కొత్తగా వీసా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

  • ఒకవేళ పాస్ పోర్టు పోయినా, చోరీకి గురైనా కొత్త పాస్ పోర్టు తీసుకున్నవారు, పాస్ పోర్టును రెన్యువల్ చేయించుకున్నవారు పాత పాస్ పోర్టుకు సంబంధించిన ఫొటోకాపీని, ఇతర పత్రాలను దరఖాస్తుతో పాటు సమర్పించాలి. అప్పుడే వారి అపాయింట్ మెంట్ ప్రక్రియకు అనుమతి లభిస్తుంది.

  • ఎమ్, ఎఫ్ కేటగిరీ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు స్టూడెంట్ అండ్ ఎక్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ ధ్రువీకరించిన స్కూల్, లేదా ప్రోగ్రామ్ లో పేర్లు నమోదు చేసుకోవడం తప్పనిసరి. జే కేటగిరీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారికి అమెరికా విదేశాంగ శాఖ అనుమతి ఉన్న సంస్థ నుంచి స్పాన్సర్ షిప్ తప్పనిసరి.

విద్యార్థి వీసాలు కోరుకునే అభ్యర్థులు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని దరఖాస్తు చేసుకోవాలని అమెరికా ఎంబసీ స్పష్టం చేసింది. వీసా అంశంలో మోసాలు, అపాయింట్ మెంట్ వ్యవస్థను దుర్వినియోగం చేయడాన్ని కట్టడి చేసేందుకే నిబంధనలు మార్చినట్టు వెల్లడించింది.

More Telugu News