Hamas: రెండవ బ్యాచ్‌లో 13 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసిన హమాస్
- నలుగురు థాయ్‌లాండ్ పౌరులు సహా మొత్తం 17 మంది విడుదల
- ఇజ్రాయెల్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించిన హమాస్
- తీవ్ర జాప్యం అనంతరం రెండవ బ్యాచ్ బందీల విడుదల
- ప్రతిగా 33 మంది పాలస్తీనా ఖైదీలను అప్పగించిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్‌తో సంధిలో భాగంగా రెండవ బ్యాచ్ ఖైదీలను హమాస్ శనివారం విడుదల చేసింది. 13 మంది ఇజ్రాయెలీ పౌరులు, నలుగురు థాయ్‌లాండ్ పౌరులకు విముక్తి కల్పించినట్టు వెల్లడించింది. కాగా రెండవ బ్యాచ్ బందీల అప్పగింతలో హమాస్ తీవ్ర జాప్యం చేసింది. దీంతో విడుదల చేస్తుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం 17 మంది ఇజ్రాయెల్ చేరుకున్నారని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు ప్రధాని బెంజిమాన్ నెతన్యాహూ కార్యాలయం, ఇజ్రాయెల్ సైన్యం ఉమ్మడిగా ప్రకటన చేశాయి. కాగా మొదటి బ్యాచ్‌లో 13 మంది ఇజ్రాయెల్, ఏడుగురు ఇతర దేశాలకు చెందిన బందీలు ఉన్న విషయం తెలిసిందే.
ఇదిలావుండగా.. ఇజ్రాయెల్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందంటూ హమాస్ శనివారం ఆరోపించింది. ఈ కారణంగానే రెండవ బ్యాచ్ బందీలను ఆలస్యంగా విడుదల చేసింది. ఖతారీ, ఈజిప్ట్ మధ్యవర్తులు ఖైదీలను ఎంపిక చేస్తుండగా ఇజ్రాయెల్ జోక్యం చేసుకుంటోందని, ఇక సంధి ఉన్నప్పటికీ గాజాలో పౌరులను చేరుకునేందుకు ఎలాంటి సహకారం అందించడంలేదని హమాస్ మండిపడింది. అయితే ఈ వాదనలను ఇజ్రాయెల్ అధికారులు ఖండించారు. అన్ని షరతులను పాటిస్తామంటూ సానుకూలంగా స్పందించింది. దీంతో చాలా ఆలస్యంగా రెండవ బ్యాచ్ ఖైదీలను హమాస్ విడుదల చేసింది.
కాగా రెండవ బ్యాచ్ ఖైదీల అప్పగింతలో 39 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ అప్పగించింది. ఇందులో 33 మంది పిల్లలు, ఆరుగురు మహిళలు ఉన్నారు. వీరికి బదులుగా 13 మంది ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేసింది.