Revanth Reddy: రైతుబంధు పంపిణీకి అనుమతి... బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఈసీ తీరు ఉంది: రేవంత్ రెడ్డి ఆగ్రహం
- బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అనుబంధం మరోసారి తేటతెల్లమైందన్న రేవంత్ రెడ్డి
- ఎన్నికలకు ముందు రైతుబంధు పంపిణీ వల్ల రైతులకు రూ.5వేల కోట్ల నష్టమన్న టీపీసీసీ చీఫ్
- ఎన్నికల అధికారి.. కాంగ్రెస్ నేతల ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని ఆరోపణ
కేంద్ర ఎన్నికల సంఘం తీరు అధికార పార్టీకి ప్రయోజనం కలిగించేలా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో పోలింగ్‌కు మూడు రోజుల ముందు రైతుబంధు సాయం పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందని, దీంతో బీఆర్ఎస్, బీజేపీ మధ్య అనుబంధం మరోసారి తేటతెల్లమైందన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ వీడియోను విడుదల చేశారు. నవంబర్ 15వ తేదీ లోపు రైతుబంధు సాయం పంపిణి జరిగేలా తాము గతంలోనే ఈసీని కోరామని, కానీ దానిని పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు.
బీఆర్ఎస్‌కు ప్రయోజనం చేకూర్చేలా నిన్న.. రైతుబంధు సాయం పంపిణీకి అనుమతి ఇచ్చారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు రైతుబంధు వల్ల రైతులకు రూ.5వేల కోట్ల నష్టం జరుగుతోందన్నారు. డిసెంబర్‌లో అయితే 15వేల రైతు భరోసా వచ్చేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ నాయకుల ఇళ్లు, కార్యాయాలలోనే తనిఖీలు జరుగుతున్నాయని మండిపడ్డారు.