Jairam Ramesh: బీఆర్ఎస్ కారు మ్యూజియంలో ఉండాల్సిన సమయం వచ్చింది: జైరాం రమేశ్
- రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు కాంగ్రెస్ వైపు ఉన్నారన్న జైరాం రమేశ్
- పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడు ఒక్క బీఆర్ఎస్ ఎంపీ కూడా లేరన్న కాంగ్రెస్ నేత
- హైదరాబాద్‌కు అనేక పరిశ్రమలు, ఐటీ రంగాన్ని తీసుకు వచ్చింది కాంగ్రెస్ అని వ్యాఖ్య
- కేసీఆర్ తొమ్మిదేళ్లలో ఒక్కసారి కూడా సచివాలయానికి రాలేదని విమర్శలు
- విభజన తర్వాత కేసీఆర్ కుటుంబానికే న్యాయం జరిగిందని చురకలు
బీఆర్ఎస్ అంబాసిడర్ కారు అని, అది మ్యూజియంలో ఉండాల్సిన రోజు వచ్చిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోనూ సాగిందని, ఈ యాత్ర తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందన్నారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు కాంగ్రెస్ వైపే ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ బీ టీమ్ అయితే, మజ్లిస్ సీ టీమ్ అని ఆరోపించారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంటులో ఒక్క బీఆర్ఎస్ ఎంపీ లేరని గుర్తు చేశారు. అయినప్పటికీ తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు. అప్పుడు థ్యాంక్స్ చెప్పి, ఇప్పుడు తెలంగాణ ద్రోహి అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాండ్ తెలంగాణ అని కేటీఆర్ చెబుతున్నారని, కానీ అనేక పరిశ్రమలతో పాటు ఐటీ రంగాన్ని కాంగ్రెస్సే తీసుకు వచ్చిందన్నారు.
పెట్టుబడులన్నీ హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమయ్యాయని, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు పెట్టుబడులు విస్తరించలేదని ఆయన అన్నారు. పదేళ్ల ముందు తెలంగాణ ఎలా ఉందో... ఇప్పుడూ అలాగే ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ ఏర్పడటానికి కారణాల్లో ఒకటైన ఉద్యోగాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. నోటిఫికేషన్లు పరీక్షలకే పరిమితమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగంతో రాష్ట్రంలో రోజుకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారని విమర్శించారు. పదేళ్ల తెలంగాణలో కేవలం నిరుద్యోగుల ఆత్మహత్యలే ఉన్నాయన్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల నిరుద్యోగులు నష్టపోయారన్నారు.
సీఎం కేసీఆర్ గత తొమ్మిదేళ్లలో ఒక్కసారి కూడా సచివాలయానికి రాలేదని, తెలంగాణ వచ్చాక కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని, ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి కూతురు, ముఖ్యమంత్రి మేనల్లుడు.. అందరికీ పదవులే అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ కుటుంబానికి న్యాయం జరిగిందని, కానీ పేదలకు, దళితులకు అన్యాయమే జరిగిందన్నారు. బీఆర్ఎస్ గుర్తు కారు.. ఆ కారు అంబాసిడర్... అది మ్యూజియంలో ఉండాల్సిన రోజు వచ్చిందని ఎద్దేవా చేశారు.