Bike Stunts: సెక్రటేరియట్ ముందు ప్రమాదకరంగా బైక్ స్టంట్.. బైకర్ కోసం పోలీసుల గాలింపు

Bike Stunts At Secretariat And Steel Bridge In Hyderabad
  • సోషల్ మీడియాలో లైక్స్ కోసం ప్రమాదకర ఫీట్లు
  • వైరల్ గా మారిన వీడియో.. మండిపడుతున్న నెటిజన్లు
  • చర్యలు తీసుకోవాలంటూ వివరాలు ట్వీట్ చేసిన ఓ యూజర్
తెలంగాణ సచివాలయం ముందు ఓ యువకుడు ప్రమాదకరంగా బైక్ స్టంట్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి ఫీట్లు చేస్తూ వారితో పాటు రోడ్డు మీద ప్రయాణించే ఇతరుల ప్రాణాలను రిస్క్ లో పడేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేస్తూ వీడియోను షేర్ చేస్తున్నారు. ఓ యువకుడు ఈ బైక్ స్టంట్ వీడియో ట్వీట్ చేస్తూ.. బైక్ వివరాలు, ఇన్ స్టా వివరాలను షేర్ చేశాడు. బైక్ తో స్టంట్లు చేసిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. 

అర్ధరాత్రి సమయంలో ఖాళీగా ఉండే సిటీ రోడ్లపై బైక్ లతో ప్రమాదకరంగా స్టంట్స్ చేయడం ఇటీవల పెరిగింది. సోషల్ మీడియా ఖాతాలలో లైక్స్, వ్యూస్ కోసం కొంతమంది యువకులు ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నారు. దీనివల్ల మిగతా వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. తాజా ఘటనకు సంబంధించి వైరల్ గా మారిన వీడియోను నెటిజన్లు పోలీసులకు పంపిస్తున్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లోని ట్రాఫిక్ విభాగం ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. కాగా, ఈ వీడియోను పరిశీలించిన పోలీసులు బైక్ స్టంట్స్ చేసిన యువకుడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం.

Bike Stunts
Secretariat
Hyderabad
Steel Bridge
Twitter
Viral Videos

More Telugu News