Rinku Singh: థ్రిల్లర్‌ మ్యాచ్‌లో లెక్కలోకి రాకుండా పోయిన రింకూ సింగ్ చివరి సిక్సర్.. అందుకు కారణం ఇదే!

Rinku Singh six not taken into account for this reason
  • చివరి బంతికి సింగిల్ అవసరమవ్వగా సిక్సర్ కొట్టిన రింకూ సింగ్
  • సిక్సర్ కొట్టిన బంతి నో బాల్ కావడంతో విజయం సాధించిన భారత్
  • గెలుపు పూర్తవ్వడంతో లెక్కలోకి రాకుండా పోయిన రింకూ సిక్సర్‌
గురువారం విశాఖపట్నం వేదికగా జరిగిన మొదటి టీ20లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఉత్కంఠభరిత విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యాన్ని మరొక బంతి మిగిలివుండగానే గెలిచింది. సీన్ అబ్బాట్ వేసిన చివరి ఓవర్‌లో 7 పరుగులు అవసరమవ్వగా అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్‌లు వరుసగా ఔటవ్వడం ఉత్కంఠను రేపింది. భారత్ గెలుపుపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే చివరి బంతికి 1 పరుగు అవసరమవ్వగా క్రీజులో ఉన్న రింకూ సింగ్ భారీ సిక్సర్ కొట్టి టీమిండియాకి విజయాన్ని కట్టబెట్టాడు. దీంతో అభిమానుల అరుపులు, కేకలతో విశాఖపట్నం స్టేడియం మోతెక్కిపోయింది. అయితే టీమిండియాని గెలిపించిన రింకూ చివరి సిక్సర్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. సిక్సర్ కొట్టిన బంతి ‘నో బాల్’గా అంపైర్లు నిర్ధారించారు. కావాల్సిన ఒక్క పరుగు నో బాల్ రూపంలో రావడంతో భారత్ విజయం సాధించింది. దీంతో రింకూ కొట్టిన సిక్సర్‌ను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. నో బాల్ కారణంగా రింకూ కష్టపడి కొట్టిన భారీ సిక్సర్ లెక్కలోకి రాకుండా పోయింది.

కాగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. జోస్ ఇంగ్లిష్ 110 పరుగులతో రాణించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు నమోదు చేసింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. అయితే చివరి ఓవర్‌లో హైడ్రామా నడిచింది. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌ వరుసగా ఔటవ్వడం నాటకీయంగా మారింది. అయితే క్రీజులో రింకూ ఉండడంతో భారత్ విజయం సాధించింది. 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో రాణించి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించారు. దీంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. 42 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డ్ దక్కింది.
Rinku Singh
Cricket
india vs Australia
Team India

More Telugu News