Revanth Reddy: మాకు 80 సీట్ల కంటే ఒక్క సీటు తక్కువ వచ్చినా.. కేసీఆర్ విధించే ఏ శిక్షకైనా నేను సిద్ధమే: రేవంత్ రెడ్డి సవాల్

Revanth Reddy fires on KCR

  • కేసీఆర్ బక్కోడు కాదు.. బకాసురుడు అన్న రేవంత్
  • లక్ష కోట్ల తెలంగాణ సంపద మింగేశారని ఆరోపణ
  • గజ్వేల్ లో వ్యతిరేకత కారణంగానే కామారెడ్డికి పారిపోయారని ఎద్దేవా

ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏ సభకు పోయినా తాను బక్కోడినని చెప్పుకుంటున్నారని... ఆయన బక్కోడు కాదు, బకాసురుడు అని విమర్శించారు. లక్ష కోట్ల తెలంగాణ సంపదను మింగిన బకాసురుడు అని అన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న 10 వేల ఎకరాల భూమిని మింగేశారని ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతే ఫాంహౌస్ కు వెళ్లి పడుకుంటానని చెపుతున్నారని... ఫామ్ హౌస్ లో పడుకుంటానంటే గజ్వేల్ యువత ఊరుకోరని, పొలిమేరలు దాటే వరకు తరిమికొడతారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మింగిన లక్ష కోట్లను కక్కిస్తామని చెప్పారు. 

కొడంగల్ లో తనపై కేసీఆర్ ఎన్నో విమర్శలు చేశారని, తాను అబద్ధాలు చెపుతానని అన్నారని మండిపడ్డారు. ఆయన చెప్పేదే నిజమైతే డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ మాదిరి అబద్ధాల టెస్టుకు తాను సిద్ధమని చెప్పారు. గజ్వేల్ లో వస్తున్న వ్యతిరేకత కారణంగానే కామారెడ్డికి కేసీఆర్ పారిపోయారని అన్నారు. గజ్వేల్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కేసీఆర్ ఆదాయం ఎంత? ఇప్పుడు ఎంత? అని ప్రశ్నించారు. 

అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అని రేవంత్ అన్నారు. వందలాది మంది ప్రాణ త్యాగాలతో వచ్చిన తెలంగాణ... దగాకోరులు, దొంగలు, దోపిడీదారుల చేతుల్లో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఓడిపోతుందనే భయం కేసీఆర్ కు పట్టుకుందని... అందుకే కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా రావని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 80 సీట్ల కంటే ఒక్క సీటు తక్కువ వచ్చినా... కేసీఆర్ వేసే ఏ శిక్షకైనా సిద్ధమేనని సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News