Ravichandran Ashwin: సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ అప్పగించడంపై రవిచంద్రన్ అశ్విన్ స్పందన
- సూర్యకి అభినందనలు తెలిపిన వెటరన్ స్పిన్నర్
- దేశానికి నాయకత్వం వహించడం గొప్ప గౌరవమని, బాగా ఆడాలని సూచన
- సీనియర్ల విశ్రాంతి, గాయం కారణంగా పాండ్యా దూరమవ్వడంతో సూర్యకి దక్కిన కెప్టెన్సీ అవకాశం
ఆస్ట్రేలియాపై స్వదేశంలో జరగనున్న టీ20 సిరీస్‌కు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడం, టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకోకపోవడంతో బీసీసీఐ సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. తొలిసారిగా కెప్టెన్‌గా ఎంపికైన సూర్యకుమార్ యాదవ్‌కు అభినందనలు తెలిపాడు. ‘‘ కంగ్రాట్స్ సూర్య. బాగా ఆడు. దేశాన్ని నడిపించడం గొప్ప గౌరవం’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. అశ్విన్ పెట్టిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ విశ్రాంతి తీసుకున్నారు. ఇక వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ప్రస్తుతం అందుబాటులో లేడు. దీంతో స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఆడనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్‌కు సెలక్టర్లు కెప్టెన్సీ పగ్గాలు అందించారు. రుతురాజ్ గైక్వాడ్ తొలి 3 టీ20లకు వైఎస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. చివరి 2 మ్యాచ్‌లకు శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్ బాధ్యతలు స్వీకరించనున్నాడు.
కాగా ఆస్ట్రేలియా సిరీస్ ఆడుతున్న జట్టులో వన్డే వరల్డ్ కప్‌లో ఆడిన ముగ్గురు ప్లేయర్లకు మాత్రమే చోటు దక్కింది. ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ మాత్రమే ఉన్నారు. కాగా సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్‌లకు చోటు దక్కించుకున్నారు. ఇదిలావుంచితే, విశాఖపట్నం వేదికగా నేడు (గురువారం) భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.