Pawan Kalyan: ఏపీలో తిరుగుతున్నట్లుగా తెలంగాణలోనూ తిరుగుతా: కేసీఆర్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విమర్శలు

Pawan Kalyan election campaign in Hanmakonda

  • తెలంగాణ ఇచ్చిన ధైర్యంతోనే తాను ఆంధ్రాలో రౌడీలను, ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొంటున్నట్లు చెప్పిన జనసేనాని
  • బలిదానాల తెలంగాణ అవినీతిమయం కావడం బాధాకరమన్న పవన్  
  • ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మనిచ్చిందని వ్యాఖ్య 
  • దళితుడిని ముఖ్యమంత్రిగా చూడలేకపోయాం..  బీసీని చేసుకుందామని పిలుపు
  • సమస్యలు వస్తే ఏపీలోలా తెలంగాణలోను పోరాడుతానన్న పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో ఎలా తిరుగుతున్నానో... ఇక నుంచి తెలంగాణలోను అలాగే తిరుగుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ ధైర్యంతోనే తాను ఆంధ్రాలో రౌడీలను, ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొంటున్నానని తెలిపారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండలో సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రాలో రౌడీలు రాజ్యమేలుతున్నారని.. గూండాల పాలన నడుస్తోందని, అలాంటి పరిస్థితిని తట్టుకొని తాను నిలబడుతున్నానంటే వరంగల్ పోరాటస్ఫూర్తే కారణమన్నారు. బలిదానాల తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని తాను ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు.

తనకు ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మనిచ్చిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, పదేళ్ల పాటు తాను తెలంగాణ గురించి మాట్లాడలేదని, దశాబ్దం తర్వాత ఇప్పుడు మాట ఇస్తున్నానని, వచ్చే ఏడాది నుంచి ఆంధ్రాలో లాగే తెలంగాణలోనూ తిరుగుతానని స్పష్టం చేశారు. ఏ మార్పు కోసం తెలంగాణ బిడ్డలు చనిపోయారో అది సాధిద్దామన్నారు. బలిదానాలపై ఏర్పడిన రాష్ట్రం అవినీతిమయం కావడం బాధించిందన్నారు. అవినీతిరహిత తెలంగాణ రావాలన్నారు. తనకు తెలంగాణ ఎంతో బలాన్నిచ్చిందన్నారు. తన పోరాటానికి తెలంగాణ యువత అండగా ఉందన్నారు.

బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో తానూ ఉన్నానని చెప్పారు. తెలంగాణలో ఇచ్చిన హామీ మేరకు దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయామని, కనీసం బీసీ ముఖ్యమంత్రినైనా చూద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణలో జనసేన ఉంటుందని, బీజేపీతో కలిసి ముందుకు సాగుతుందన్నారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే జనసేనను స్థాపించినట్లు చెప్పారు. పార్టీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడటానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే కారణమని తెలిపారు. డబ్బు లేకపోయినా ఏ బలం లేకపోయినా గుండెబలంతో నిలబడవచ్చునని వరంగల్ గడ్డ నుండి నేర్చుకున్నానన్నారు. నాడు తెలంగాణకు మద్దతు ఇచ్చిన వారిలో తానూ ఒకడినని అన్నారు. సమస్యలు వస్తే తాను ఆంధ్రాలోలా అండగా నిలుస్తానన్నారు. బీజేపీ అభ్యర్థులు రావు పద్మ, ప్రదీప్ రావును గెలిపించాలని కోరారు.

More Telugu News