Marnus Labuschagne: ‘టీమిండియా క్రికెటర్లకు నిజాయతీగా చెబుతున్నా..’ వరల్డ్ కప్ ఫైనల్‌పై ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ లబూషేన్ లేఖ

India Were Getting Into Me says Marnus Labuschagne

  • భారత ఆటగాళ్లు మాట్లాడాలనుకున్నది తనకు వినపడలేదన్న ఆసీస్ బ్యాట్స్‌మెన్
  • పెద్ద ఎత్తున అభిమానుల అరుపులు, కేకలే కారణమని వెల్లడి
  • లబూషేన్‌ని రెచ్చగొట్టేందుకు కోహ్లీ ప్రయత్నం.. వీడియో వైరల్

వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 43 ఓవర్లలోనే ఛేదించింది. భారత బ్యాట్స్‌మెన్లు ఇబ్బంది పడిన పిచ్‌పై ఆసీస్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ ఏకంగా 137 పరుగులు కొట్టి తన జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. మరో బ్యాట్స్‌మెన్ మార్నస్ లబూషేన్ (58*) ఎలాంటి రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా ఆడుతూ చివరిదాకా క్రీజులో నిలిచాడు. అయితే క్రీజులో పాతుకుపోయిన అతడిని రెచ్చగొట్టేందుకు విరాట్ కోహ్లీ ప్రయత్నించినా ఏమాత్రం ప్రభావం చూపలేదు. విరాట్ కోహ్లీతోపాటు పలువురు ఆటగాళ్లు ఈ ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదు.

అయితే ఫైనల్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు రెచ్చగొట్టడంపై లబూషేన్ స్పందించాడు. మ్యాచ్ సమయంలో భారత జట్టు తనతో ఏదో మాట్లాడేందుకు ప్రయత్నించిందని, అయితే నిజాయతీగా చెప్పాలంటే వాళ్లు ఏం చెప్పారో తనకు నిజంగా వినపడలేదని అన్నాడు. స్టేడియంలో ఇండియా ఫ్యాన్స్ అరుపులు ఆ విధంగా ఉన్నాయని చెప్పాడు. ఈ మేరకు 'మై వరల్డ్ కప్ ఫైనల్ ర్యాప్' పేరిట ఒక లేఖను భారత మీడియాకు విడుదల చేశాడు. భారత అభిమానుల అరుపులు, కేకలతో స్టేడియం మోతెక్కిపోయిందని, భారత్‌ పట్టు సాధిస్తుందనుకున్న సమయంలో ఫ్యాన్స్ నుంచి లభించిన మద్ధతు అపారమైనదని లబూషేన్ గుర్తుచేశాడు. బస్సులో హోటల్ నుంచి గ్రౌండ్‌కి వస్తున్న సమయంలో సుమారు 5 కిలోమీటర్ల మేర వీధుల్లో అభిమానులు కనిపించడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పాడు.  మైదానం నీలి సముద్రంగా మారిపోయిందని,  జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో ‘మేము వర్సెస్ ప్రపంచం’ అనే భావన కలిగిందని అన్నాడు. 

ఇక విరాట్ కోహ్లీ ఔట్ అయినప్పుడు నరేంద్ర మోడీ స్టేడియంలో వాతావరణంపై స్పందిస్తూ.. 1,30,000 మంది అభిమానులు ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండిపోయారని పేర్కొన్నాడు. మ్యాచ్‌లో ఇది కీలకమైన సందర్భమని అభివర్ణించాడు. కాగా స్థిరంగా బ్యాటింగ్ చేస్తున్న లబూషేన్‌ని రెచ్చగొట్టేందుకు విరాట్ కోహ్లీ ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

Marnus Labuschagne
Team India
Cricket
Virat Kohli
world cup 2023
India Vs Australia

More Telugu News