David Warner: వరల్డ్ కప్ గెలిచాక భారతీయులకు డేవిడ్ వార్నర్ క్షమాపణ!
- వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా ఎగరేసుకుపోవడంతో తీవ్ర విచారంలో భారతీయులు
- కోట్ల మంది హృదయాలను ముక్కలు చేశావంటూ డేవిడ్ వార్నర్‌కు నెటిజన్ పోస్ట్
- క్షమాపణలు చెబుతున్నా అంటూ వార్నర్ రిప్లై
- ఇండియా కూడా అద్భుతంగా ఆడిందంటూ కితాబు
వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా ఎగరేసుకుపోవడం భారతీయులకు తీవ్ర మనోవేదన మిగిల్చింది. పది విజయాలతో అజేయంగా కనిపించిన భారత్.. ఫైనల్స్‌లో మాత్రం ఓడిపోవడంతో భారతీయుల నిరాశలో కూరుకుపోయారు. ఈ ఓటమి నుంచి భారతీయులు ఇప్పటికీ కోలుకోలేదనే చెప్పాలి. అనేక మంది నెట్టింట తమ ఆవేదనను వెళ్లబోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ఏకంగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ముందు తన ఆక్రోశం వెళ్లగక్కాడు. కోట్ల మంది హృదయాలను ముక్కలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే భారతీయుల ఆవేదనను అర్థం చేసుకున్న వార్నర్ కూడా హుందాగా స్పందించాడు. ‘‘మీ అందరికీ క్షమాపణలు. అదో అద్భుతమైన గేమ్. ఇండియా కూడా గొప్పగా ఆడింది’’ అంటూ రిప్లై ఇచ్చాడు. భారత్‌పై ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో ఫైనల్స్‌లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, కొందరు మాత్రం వార్నర్ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.