Bandi Sanjay: ఈసారి గెలిపిస్తే మీ ఇళ్లే కొట్టేస్తారు... ఎవరిని గెలిపిస్తారో తేల్చుకోండి: కరీంనగర్‌లో బండి సంజయ్

Bandi Sanjay campaign in Karimnagar Jubli Nagar

  • గంగులను మూడుసార్లు గెలిపిస్తే భూములు కొల్లగొట్టాడని, గుట్టలు మాయం చేశాడన్న సంజయ్ 
  • అబద్ధాలులు చెప్పడంలో గంగులను మించినోడు లేడని విమర్శలు
  • తన ఆస్తుల డాక్యుమెంట్లు తీసుకువస్తే అవి ప్రజలకే ఇస్తానని సవాల్
  • కాంగ్రెస్ అభ్యర్థికి కరీంనగర్ గురించే తెలియదని ఎద్దేవా
  • కేసీఆర్‌కు మూడోసారి అధికారమిస్తే అంతే సంగతులన్న బండి సంజయ్

గంగుల కమలాకర్‌కు ఎమ్మెల్యేగా మూడుసార్లు అవకాశమిస్తే భూములు కొల్లగొట్టాడని, గుట్టలను మాయం చేశాడని, పొరపాటున మళ్లీ గెలిపిస్తే ఈసారి మీ ఇళ్లను కూడా కొట్టేయడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆయన కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అబద్ధాలు చెప్పడంలో గంగులను మించినోడు లేడని, అందుకే తనను అవినీతిపరుడు అంటున్నాడని మండిపడ్డారు. నేను అధికారంలోనే లేను... అవినీతికి ఎలా పాల్పడతాను? అని ప్రశ్నించారు. ఒకవేళ అవినీతికి పాల్పడినట్లయితే... తనను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని నిలదీశారు. తనపై ఆరోపణలు చేశాడని, కాబట్టి తన ఆస్తులకు సంబంధించిన డాకుమెంట్లు అన్నింటినీ గంగుల తీసుకు రావాలని... అప్పుడు ఆ ఆస్తులన్నింటిని ప్రజలకే ఇచ్చేస్తానన్నారు.

గంగుల కమలాకర్ కూడబెట్టిన ఆస్తుల డాక్యుమెంట్లను కూడా తీసుకువస్తే, అవి కూడా ప్రజలకు ఇచ్చేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థికి కరీంనగర్ గురించే తెలియదని, రేషన్ కార్డులు, పెన్షన్లు ఎలా ఇస్తారు? అనే విషయం కూడా తెలియదని ఎద్దేవా చేశారు. భూకబ్జాలు చేయడం తప్ప, ప్రజల కోసం కొట్లాడింది లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్... ఇద్దరు అభ్యర్థులది భూకబ్జాల పంచాయతీయేనని ఆరోపించారు. పేదల కోసం ఎంతకైనా తెగించే నైజం తనదని, కాబట్టి ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని సూచించారు.

వాళ్లది కబ్జాల ఆరాటం... నాది పేదల పోరాటం... ఎటువైపు ఉంటారో మీరే తేల్చుకోండన్నారు. అబద్ధాలు, మోసాలు, భూకబ్జాల్లో గంగుల కమలాకర్ నెంబర్ వన్ అన్నారు. బియ్యం టెండర్లలో గంగుల రూ.1300 కోట్ల గోల్ మాల్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఇంట్లో ఐదుగురికి పదవులు ఉన్నాయని, కానీ తెలంగాణలోని నిరుద్యోగులు ఏం పాపం చేశారు? అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఏమైందో చెప్పాలని నిలదీశారు. ఒకటో తారీఖున వేతనాలు ఇవ్వలేని కేసీఆర్‌కు మళ్లీ అధికారిమిస్తే అంతే సంగతులని నిప్పులు చెరిగారు.

Bandi Sanjay
BJP
Telangana Assembly Election
  • Loading...

More Telugu News