Revanth Reddy: కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోవాలని కేటీఆర్ కోరుకుంటున్నాడు... ఎందుకంటే?: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Revanth Reddy says KTR wants kcrs defeat in kamareddy

  • తండ్రి ఓడిపోతే తాను ముఖ్యమంత్రి కావాలని కేటీఆర్ కలలు కంటున్నారన్న టీపీసీసీ చీఫ్
  • కేసీఆర్‌పై పోటీ చేయమని ఆదేశించినప్పుడు సంతోషించానన్న రేవంత్ రెడ్డి
  • కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని ధీమా
  • ముఖ్యమంత్రిగా ఎవరిని నిర్ణయించినా అంగీకరిస్తానన్న రేవంత్ రెడ్డి

కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓడిపోవాలని మంత్రి కేటీఆర్ కోరుకుంటున్నారని, ఎందుకంటే తండ్రి ఓడిపోతే తాను ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం సాక్షి ఛానల్ నిర్వహించిన బిగ్ క్వశ్చన్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తాను పార్టీ ఆదేశాల మేరకే రెండుచోట్ల పోటీ చేస్తున్నానని చెప్పారు. కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేయమని చెప్పినప్పుడు తాను ఎంతో సంతోషించానని తెలిపారు. అసలు కేసీఆర్‌కు దమ్ముంటే కొడంగల్ వచ్చి తనపై పోటీ చేయాల్సిందని వ్యాఖ్యానించారు. మంత్రి కేటీఆర్ తన తనయుడు హిమాన్షు ఆస్తులను ప్రకటించలేదన్నారు.

తెలంగాణ ప్రజలు హంగ్ ఇవ్వరని, కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు తాను, మల్లు భట్టి విక్రమార్క గ్యారెంటీ అన్నారు. ఏఐసీసీ ఆమోదంతోనే తాము వీటిని ప్రకటించామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా పార్టీ ఎవరిని నిర్ణయించినా తాము అంగీకరిస్తామన్నారు. అవినీతికి పాల్పడినవారు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ తరహా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ప్రతి బూత్‌కు ఒక వాలంటీర్‌ను నియమిస్తామన్నారు. పరిపాలనను ప్రజల వద్దకు తీసుకువెళతామని వెల్లడించారు. బూత్ లెవల్లో సంక్షేమాన్ని అమలు చేస్తామన్నారు.

జనాభా ఆధారంగా తాము జిల్లాల మార్పును చేపడతామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాదనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ 25 సీట్లు దాటదని, బీజేపీ నాలుగు నుంచి ఆరు సీట్లు మాత్రమే గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఇక్కడ గెలిచేది లేదు.. ఏమీ లేదు.. కాబట్టి బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటిస్తారని చెప్పారు. ఉన్న బీసీని అధ్యక్షుడిగా తొలగించి రెడ్డికి ఇచ్చారన్నారు. కేసీఆర్ కోసమే బీజేపీ అధ్యక్షుడిగా బీసీని తొలగించి రెడ్డిని తీసుకువచ్చి పెట్టారన్నారు. ఈ రోజు కాంగ్రెస్ బీసీలకు 23 సీట్లు ఇచ్చిందని, రేపు 28 ఇవ్వవచ్చునని, బీసీ రిజర్వేషన్ వస్తే తప్పనిసరిగా ఇవ్వాల్సిందే అన్నారు.

  • Loading...

More Telugu News