Australia: టీమిండియాకు తీవ్ర నిరాశ... వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా
- ఫైనల్లో 6 వికెట్ల తేడాతో నెగ్గిన ఆసీస్
- ఆసీస్ టార్గెట్ 241 రన్స్... 43 ఓవర్లలో ఛేదించిన వైనం
- సెంచరీతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్
- చక్కని సహకారం అందించిన లబుషేన్
- ఆసీస్ ఖాతాలో 6వ ప్రపంచకప్
భారత గడ్డపై జరిగిన వరల్డ్ కప్ ను పాట్ కమిన్స్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఎగరేసుకెళ్లింది. అలా ఇలా కాదు... టోర్నీలో తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి, ఆ తర్వాత వరుస విజయాలు సాధించి, ఆఫ్ఘన్ వంటి జట్టుపై అద్భుత రీతిలో పోరాడి, సెమీస్ లో దక్షిణాఫ్రికాను మట్టికరిపించి ఫైనల్ చేరిన ఆసీస్ జట్టు... ఫైనల్లో ఆతిథ్య టీమిండియాను ఓడించి సగర్వంగా వరల్డ్ కప్ ను ఒడిసిపట్టింది.
ఇవాళ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కంగారూలు ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచి 6 వికెట్లతో తేడాతో ఘనవిజయం సాధించారు. తొలుత టీమిండియాను 240 పరుగులకు పరిమితం చేసిన ఆస్ట్రేలియన్లు... 241 పరుగుల లక్ష్యాన్ని 43 ఓవర్లలో 4 వికెట్లకు ఛేదించారు. తద్వారా రికార్డు స్థాయిలో 6వ ప్రపంచకప్ టైటిల్ ను సాధించారు.
ఆసీస్ విజయంలో బౌలర్లు, ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్రధాన పాత్ర పోషించారు. బౌలర్లు స్టార్క్, హేజెల్ వుడ్ కెప్టెన్ కమిన్స్ విశేషంగా రాణించి టీమిండియాను 240 పరుగులకు ఆలౌట్ చేయగా... 241 పరుగుల లక్ష్యఛేదనలో ట్రావిస్ హెడ్ చిరస్మరణీయ సెంచరీతో అదరగొట్టాడు. హెడ్ కు లబుషేన్ తోడవడంతో ఆ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు టీమిండియా విఫలయత్నాలు చేసింది.
కానీ కొరకరానికొయ్యల్లా మారిన ఈ ఇద్దరు బ్యాటర్లు ఆతిథ్య జట్టుకు విజయాన్ని దూరం చేశారు. హెడ్ 137 పరుగులు చేయగా, లబుషేన్ 58 పరుగులతోనూ అజేయంగా నిలిచారు. హెడ్ 120 బంతులాడి 15 ఫోర్లు, 4 సిక్సులు కొట్టాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 2, షమీ 1, సిరాజ్ 1 వికెట్ తీశారు.
2003 వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి టీమిండియా నేడు ప్రతీకారం తీర్చుకుంటుందని అందరూ భావిస్తే... ఆస్ట్రేలియా జట్టు తాను అంచనాలకు అందే జట్టును కాదంటూ వరల్డ్ కప్-2023 విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా గతంలో 1987, 1999, 2003, 2015లోనూ వన్డే వరల్డ్ కప్ టైటిళ్లు నెగ్గింది.