Andy Atkinson: వరల్డ్ కప్ ఫైనల్ ఆడబోయే పిచ్‌ను పర్యవేక్షించనున్న ఐసీసీ హెడ్ పిచ్ క్యూరేటర్ ఆండీ అట్కిన్సన్
- బీసీసీఐ క్యూరేటర్లతో కలిసి పిచ్‌ను పరిశీలించనున్న అట్కిన్సన్
- న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా సెమీఫైనల్ పిచ్‌ను మార్చారంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో పర్యవేక్షణ
- స్లో బ్యాటింగ్ ట్రాక్ తయారు చేస్తున్నారంటూ పేర్కొంటున్న పలు రిపోర్టులు
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనున్న అహ్మదాబాద్ మోతెరా పిచ్‌ను ఐసీసీ హెడ్ పిచ్ క్యూరేటర్ ఆండీ అట్కిన్సన్ పర్యవేక్షించనున్నారని తెలుస్తోంది. అట్కిన్సన్ ఇండియా నుంచి వెళ్లిపోవడంతో బీసీసీఐ క్యూరేటర్లు పిచ్‌ను సన్నద్ధం చేస్తున్నారంటూ తొలుత వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవాలేనని, అట్కిన్సన్ పిచ్‌ను పర్యవేక్షించనున్నారని పీటీఐ పేర్కొంది. క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా బీసీసీఐ క్యూరేటర్లతో చేరతారని తెలిపింది. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌కు పిచ్‌ను మార్చారంటూ తీవ్రమైన విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
మరోవైపు.. శుక్రవారం బీసీసీఐకి చెందిన ఇద్దరు సీనియర్ గ్రౌండ్ స్టాఫ్ చీఫ్ ఆశిష్ భౌమిక్, తపోష్ ఛటర్జీతోపాటు భారత మాజీ సీమర్, బీసీసీఐ జీఎం(దేశీయ క్రికెట్) అబ్బే కురువిల్లేలు పిచ్ సన్నాహాలను నిశితంగా పరిశీలించారని పీటీఐ రిపోర్ట్ పేర్కొంది. హెవీ రోలర్‌ని ఉపయోగించి ఫైనల్ మ్యాచ్‌కు స్లో ట్రాక్‌ను సిద్ధం చేస్తున్నారంటూ ఇప్పటికే పలు రిపోర్టులు పేర్కొన్నాయి. మొదటి బ్యాటింగ్ చేసే జట్టుకు సానుకూలత ఉండొచ్చని సదరు రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే ఈ పిచ్‌ను ఉపయోగిస్తారా లేదా అనే దానిపై బీసీసీఐ లేదా ఇతర అధికారిక వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేదు. అయితే నల్ల మట్టి స్ట్రిప్‌పై హెవీ రోలర్‌ని ఉపయోగిస్తే స్లో బ్యాటింగ్ ట్రాక్‌ని రూపొందిస్తారని భావించాలని, ఈ పిచ్‌పై భారీ స్కోరు సాధించే అవకాశం ఉంటుందని పీటీఐ రిపోర్ట్ పేర్కొంది. రాష్ట్ర అసోసియేషన్ క్యూరేటర్‌ను మాటలను ఉటంకిస్తూ ఈ మేరకు పేర్కొంది.