Team India: ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’.. పోటీలో ఉన్న ఆ నలుగురు టీమిండియా ఆటగాళ్ల పేర్లు బయటపెట్టిన ఐసీసీ
- అవార్డు కోసం పోటీలో 9 మంది
- టీమిండియా నుంచి నలుగురు, ఆసీస్, కివీస్ నుంచి చెరో ఇద్దరు
- దక్షిణాఫ్రికా నుంచి ఒకే ఒక్కడు
ప్రపంచకప్ ఫైనల్ దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు రేసులో ఉన్న వారి పేర్లను ఐసీసీ ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కోసం సెమీఫైనల్‌లో అడుగుపెట్టిన నాలుగు జట్ల నుంచి మొత్తం 9 మంది ఆటగాళ్లు పోటీపడుతున్నారు. వీరిలో నలుగురు భారత ఆటగాళ్లు ఉన్నారు. మిగతా వారిలో ఆస్ట్రేలియా, కివీస్ జట్ల నుంచి ఇద్దరేసి, దక్షిణాఫ్రికా జట్టు నుంచి ఒక ఆటగాడు ఉన్నారు.
ఈ అవార్డుకు పోటీపడుతున్న టీమిండియా ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, రోహిత్‌శర్మ, జస్ప్రీత్ బుమ్రా ఉండగా, మరోవైపు, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడం జంపా, రచిన్ రవీంద్ర, డరిల్ మిచెల్, క్వింటన్ డికాక్ పోటీ ఇస్తున్నారు. కోహ్లీ 10 మ్యాచుల్లో 711 పరుగులు చేయగా, డికాక్ 594 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో రచిన్ రవీంద్ర (578), డరిల్ మిచెల్ (552) ఉన్నారు. రోహిత్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. మ్యాక్స్‌వెల్ 8 మ్యాచుల్లో 398 పరుగులు చేశాడు.
బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, షమీ, జంపా పోటీపడుతున్నారు. షమీ ఆరు మ్యాచుల్లో ఏకంగా 23 వికెట్లు తీసుకున్నాడు. జంపా 10 గేముల్లో 22 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా 10 మ్యాచుల్లో 18 వికెట్లు పడగొట్టినా అద్భుత ఎకానమీ సాధించాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా కొనసాగుతున్నాడు.