Ambati Rambabu: ఎయిర్ పోర్టు వద్ద మీడియాపై మంత్రి అంబటి రాంబాబు అసహనం... వీడియో ఇదిగో!

Ambati Rambabu fires on Media

  • ఎయిర్ పోర్టు వద్ద మంత్రి అంబటిని పలకరించిన మీడియా
  • సంగతులేమీ లేవంటూ వెళ్లిపోయే ప్రయత్నం చేసిన మంత్రి
  • కారు వరకు వచ్చిన మీడియా ప్రతినిధులు
  • తమను సెక్యూరిటీ సిబ్బంది తోసేస్తున్నారని ఫిర్యాదు 
  • ఎవరి డ్యూటీ వాళ్లు చేయాలన్న అంబటి

ఏపీ మంత్రి అంబటి రాంబాబు గన్నవరం ఎయిర్ పోర్టులో మీడియాపై చిర్రుబుర్రులాడారు. విమానం దిగి వస్తున్న ఆయనను మీడియా పలకరించింది. గుడ్ ఈవెనింగ్ సర్ అంటూ మీడియా ప్రతినిధులు మంత్రిని విష్ చేశారు. 'ఏమీ లేదబ్బా విషయం' అంటూ అంబటి కారెక్కి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. 

అయితే ఆయనను పోలవరం, తదితర అంశాలపై ప్రశ్నలు అడిగేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. ఈ క్రమంలో మంత్రి అంబటి భద్రతా సిబ్బంది తమను తోసివేశారని రిపోర్టర్లు ఆరోపించారు. ఏంటయ్యా ఏంటీ అంటూ అంబటి కాస్తంత కోపంగా అడిగారు. 'తోసేస్తున్నారు సర్' అంటూ రిపోర్టర్లు అంబటికి తెలిపారు. 

దాంతో అంబటి స్పందిస్తూ... ఎవరి పని వాళ్లు చేసుకుంటే బాగుంటుంది... వాళ్ల పని వాళ్లు చేశారు, మీ డ్యూటీ మీరు చేసుకోండి అంటూ మీడియాపై అసహనం ప్రదర్శించారు. మా డ్యూటీ కోసమే వచ్చాం సర్ అంటూ మీడియా ప్రతినిధులు బదులివ్వగా, కాస్త స్వరం పెంచిన మంత్రి అంబటి... వాదన ఎందుకు? అంటూ ప్రశ్నించారు. చివరికి మీడియా ప్రశ్నలకు సమాధానమివ్వకుండానే మంత్రి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Ambati Rambabu
Media
Airport
YSRCP

More Telugu News