Australia: పోరాడి ఓడిన సఫారీలు... వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఆసీస్

Australia reach world cup finals by beating South Africa in semis

  • ఈడెన్ గార్డెన్స్ లో హోరాహోరీగా వరల్డ్ కప్ సెమీఫైనల్
  • 3 వికెట్ల తేడాతో నెగ్గిన ఆస్ట్రేలియా
  • మరోసారి సెమీస్ లోనే ముగిసిన దక్షిణాఫ్రికా ప్రస్థానం
  • ఈ నెల 19న వరల్డ్ కప్ ఫైనల్
  • అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా × ఆస్ట్రేలియా

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో హోరాహోరీగా సాగిన సెమీఫైనల్ సమరంలో చివరికి ఆస్ట్రేలియానే నెగ్గింది. ఈ లో స్కోరింగ్ మ్యాచ్ లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. 213 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునేందుకు దక్షిణాఫ్రికా ఆఖరి వరకు పోరాడింది. పలు క్యాచ్ లు జారవిడవడం సఫారీలకు ప్రతికూలంగా మారింది. 

వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఇంతవరకు ఫైనల్ చేరని దక్షిణాఫ్రికా మరోసారి సెమీస్ లోనే వెనుదిరిగింది. దక్షిణాఫ్రికా ఇప్పటివరకు 4 పర్యాయాలు సెమీస్ లోనే వెనుదిరిగింది. వరల్డ్ కప్ చరిత్రలో ఆసీస్ ఫైనల్ చేరడం ఇది ఎనిమిదోసారి. మరే జట్టు ఇన్నిసార్లు ఫైనల్ చేరలేదు.

స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ ఈ మ్యాచ్ లో గెలిచేందుకు ఆసీస్ చాలా కష్టపడింది. కీలక దశలో వికెట్లు కోల్పోవడంతో ఓ దశలో ఆసీస్ గెలవడం కష్టమే అనిపించింది. స్కోరు పెద్దగా లేకపోయినప్పటికీ, దక్షిణాఫ్రికా బౌలర్లు ఆసీస్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచిన తీరు విమర్శకులను సైతం ఆకట్టుకుంది. అయితే లక్ష్యం చిన్నది కావడంతో ఆసీస్ నే విజయలక్ష్మి వరించింది. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్యఛేదనలో ఆసీస్ 47.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసి విజయం అందుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్ చూస్తే ట్రావిస్ హెడ్ 62, డేవిడ్ వార్నర్ 29, స్టీవ్ స్మిత్ 30, లబుషేన్ 18, జోష్ ఇంగ్లిస్ 28, స్టార్క్ 16 (నాటౌట్), పాట్ కమిన్స్ 14 (నాటౌట్) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోట్జీ 2, తబ్రైజ్ షంసీ 2, రబాడా 1, మార్ క్రమ్ 1, కేశవ్ మహరాజ్ 1 వికెట్ తీశారు. 

ఈ విజయంతో వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఆసీస్ టైటిల్ కోసం టీమిండియాతో తలపడనుంది. ఈ నెల 19న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నిన్న జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ను ఓడించి ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. 

కాగా, వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఆసీస్ ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 5 సార్లు విజేతగా నిలవగా, టీమిండియా రెండు పర్యాయాలు కప్ నెగ్గింది.

  • Loading...

More Telugu News