Dharmareddy: ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపణలపై స్పందించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి
- గతంలో ధర్మారెడ్డిపై ఢిల్లీలో క్రిమినల్ కేసు నమోదైందన్న ఆనం
- 14 సెక్షన్ల కింద కేసు పెట్టారని వెల్లడి
- ఈవోగా ధర్మారెడ్డికి అర్హత లేదని వ్యాఖ్యలు
- ఆనం వెంకట రమణారెడ్డి వ్యాఖ్యల్లో నిజంలేదన్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పెద్దలపై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. తాడేపల్లి ప్యాలెస్ లో సజ్జల ఎలాగో, టీటీడీలో ఈవో ధర్మారెడ్డి వ్యవహారం అలాగే ఉందని అన్నారు. ధర్మారెడ్డిపై గతంలో ఢిల్లీలో క్రిమినల్ కేసు నమోదైందని, ఆయన అవినీతిపై 14 సెక్షన్ల కింద కేసు పెట్టారని ఆనం వెంకటరమణారెడ్డి వెల్లడించారు. అయితే, ధర్మారెడ్డి ఆ కేసు దాచిపెట్టి టీటీడీలో ఈవో అయ్యారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి టీటీడీలోనూ అవినీతి చేయరన్న గ్యారెంటీ ఏంటని ప్రశ్నించారు.
దీనిపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపణలను ఖండించారు. ధర్మారెడ్డి తిరుమల అన్నమయ్య భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై 14 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదైందని, ఈవోగా తనకు అర్హత లేదని ఆనం ఆరోపణలు చేశారని, అయితే ఆనం చేసిన వ్యాఖ్యల్లో నిజంలేదని అన్నారు. ఈవోగా తనకు అన్ని అర్హతలు ఉన్నాయని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. కొందరు హైకోర్టుకు వెళితే... తన పదవి కలెక్టర్ హోదా కంటే ఎక్కువ అని న్యాయస్థానం చెప్పిందని వెల్లడించారు. ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధం అని ధర్మారెడ్డి పేర్కొన్నారు.