KCR: మూడేళ్లు ఆలోచించి ధరణి తీసుకొస్తే రాహుల్ గాంధీ బంగాళాఖాతంలో కలిపేస్తారట: కేసీఆర్

KCR praja ashirvada meeting in Adilabad

  • రైతుబంధు కావాలా? రాబంధు కావాలా? ఏది కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని సూచన
  • ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నారన్న ముఖ్యమంత్రి
  • రేవంత్ రెడ్డేమో ఇరవై నాలుగు గంటల విద్యుత్ వేస్ట్ అంటున్నారని కేసీఆర్ మండిపాటు

తాము మూడేళ్లు ఆలోచించి ధరణిని తీసుకువచ్చామని, అలాంటి ధరణిని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలో వేస్తుందని, ఈ విషయం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీయే చెప్పారని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. గురువారం అదిలాబాద్‌లో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైతుబంధు కావాలా? రాబంధు కావాలా? ఏది కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతుబంధుతో డబ్బులు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. కానీ బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక రైతుబంధును విడతలవారీగా ఎకరాకు రూ.16 వేలకు పెంచుతామన్నారు. 

ఇక పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు గంటల విద్యుత్ వేస్ట్ అంటున్నారని, మూడు గంటలు ఇస్తే సరిపోతుందన్నారని విమర్శించారు. 24 గంటల విద్యుత్ కావాలంటే జోగు రామన్నను గెలిపించాలన్నారు. ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిస్తే హైదరాబాద్‌లో అదే ప్రభుత్వం వస్తుందన్నారు. ఓటు ఒకరికి వేసి... పని ఇంకొకరిని చేయమంటే చేయరన్నారు. ఓటు వేరేవారికి వేసి పని చేయమని జోగు రామన్నను చేయమంటే చేస్తాడా? అన్నారు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమనవద్దని సూచించారు.

రైతుల భూములు ఇతరులకు వెళ్లవద్దని, ఒకరిపై వున్న భూమి ఇంకొకరి పేరుమీదకు మారవద్దనే ఉద్దేశంతో ధరణిని తీసుకువచ్చామన్నారు. ధరణితో ప్రభుత్వం వద్ద ఉన్న అధికారం మీ వద్దకు వచ్చిందన్నారు.  మీ బొటనవేలు పెడితేనే మీ భూయాజమాన్యం మారుతుందన్నారు. మీ భూమిని మరొకరికి మార్చే శక్తి మీకు తప్ప ముఖ్యమంత్రికి కూడా లేదన్నారు. అలాంటి అధికారం మీకు ఉండాలా? వద్దా? ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ వస్తే ధరణిని తీసేసి బంగాళాఖాతంలో వేస్తామని రాహుల్ గాంధీ అంటున్నారని ధ్వజమెత్తారు. అలాంటి ధరణిని తీసేస్తే మీకు రైతుబంధు ఎలా వస్తుందని ప్రశ్నించారు.

KCR
Rahul Gandhi
Revanth Reddy
Uttam Kumar Reddy
Telangana Assembly Election
  • Loading...

More Telugu News