Revanth Reddy: మనవడి కోసమే కేసీఆర్... మూడోసారి అధికారం అడుగుతున్నారు!: రేవంత్ రెడ్డి

Revanth Reddy vijaya bheri yatra in vardhannapet

  • మనవడిని మంత్రిగా చేసేందుకు కేసీఆర్ అధికారం అడుగుతున్నారని చురకలు
  • ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా తెలంగాణ ఇచ్చారన్న రేవంత్
  • కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారని విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా నష్టం జరుగుతుందని, అధికారం కోల్పోతామని తెలిసినా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వర్ధన్నపేటలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్ర సభలో రేవంత్ మాట్లాడుతూ.... ప్రజలు కోరుకున్న తెలంగాణ రాష్ట్రంలో లేదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. మనం కోరుకున్న సామాజిక న్యాయం ఈ పాలనలో జరగలేదన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పేదవాడికి సంక్షేమం జరగడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంద్ రాదని కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారన్నారు.

మా కొడుకు, కూతురు, అల్లుడు, సడ్డకుడి కొడుకు, దద్దమ్మ దయాకర్ కూడా మంత్రులు అయ్యారని, ఇప్పుడు మా మనవడిని మంత్రిగా చేసేందుకు తనకు మూడోసారి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ చెబుతున్నారని చురకలు అంటించారు. వీళ్లెవరినో పదవుల్లో చూసేందుకు మనం తెలంగాణ సాధించుకున్నామా? అని రేవంత్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ కూలీకి వెళ్లే ప్రతి ఒక్కరికి రూ.12వేలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తామన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తామన్నారు. విద్యార్థుల చదువుల కోసం రూ.5 లక్షల గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు.

కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచారన్నారు. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందన్నారు. లక్ష కోట్లు పెట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు కింద ఇసుక కదిలితే కుంగిపోయిందని చెప్పినందుకు చెప్పుతీసి కొట్టవద్దా? అని రేవంత్ ప్రశ్నించారు. ఎవరైనా ఇసుక మీద బ్యారేజీ కడుతారా? అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తానని చెప్పిన కేసీఆర్ గజ్వేల్‌లో వెయ్యి ఎకరాల్లో వందల గదులతో గడీలు నిర్మించుకున్నారని, కొడుకు కేటీఆర్ జన్వాడలో వంద ఎకరాల్లో వంద కోట్లతో మరో గడీ నిర్మించుకున్నారన్నారు. పంజాగుట్ట కేంద్రంలో 150 బెడ్రూంలతో పది ఎకరాల్లో కేసీఆర్ ఇల్లు కట్టుకున్నాడని మండిపడ్డారు. తెలంగాణ సాధించింది ఇందుకేనా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని, విద్యార్థులకు మాత్రం రాలేదన్నారు.

  • Loading...

More Telugu News