Reserve Day: వరల్డ్ కప్ సెమీఫైనల్స్, ఫైనల్ కు రిజర్వ్ డే ప్రకటించిన ఐసీసీ
- ఈ నెల 15, 16 తేదీల్లో వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లు
- ఈ నెల 19న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్
- వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోతే రిజర్వ్ డేలో నిర్వహించే అవకాశం
భారత్ లో అక్టోబరు 5 నుంచి జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ సమరం చివరి అంకానికి చేరుకుంది. ఈ నెల 15, 16 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్ లు... ఈ నెల 19న జరిగే ఫైనల్ తో టోర్నీ సమాప్తమవుతుంది. కాగా, సెమీస్ మ్యాచ్ లు, ఫైనల్ మ్యాచ్ లకు ఐసీసీ రిజర్వ్ డేలను కేటాయించింది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ జరగకపోతే రిజర్వ్ డేలో నిర్వహిస్తారు.
ప్రతికూల వాతావరణం వల్ల కనీసం 20 ఓవర్ల చొప్పున కూడా జరపలేని పరిస్థితుల్లో మ్యాచ్ ను రిజర్వ్ డేకి మళ్లిస్తారు. రేపు టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే తొలి సెమీస్ కు ఎలాంటి వర్ష సూచన లేదు. ఈ మ్యాచ్ ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో జరగనుండగా... వర్షం పడేందుకు కేవలం 3 శాతం అవకాశాలు మాత్రమే ఉన్నాయి.
ఎల్లుండి కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుండగా... వర్షం పడే అవకాశాలు పగటి పూట 54 శాతం, రాత్రి వేళ 75 శాతం ఉన్నాయి.
ఆదివారం నాడు జరిగే ఫైనల్ మ్యాచ్ కు వాన ముప్పు ఏమాత్రం లేదని వాతావరణ సంస్థల నివేదికలు చెబుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ రోజున వర్షం పడే అవకాశాలు కేవలం 0-1 శాతం మాత్రమే ఉన్నాయి.
ఇక, వర్షం వల్ల రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ జరిపేందుకు వీలు కాకపోతే... పాయింట్ల పట్టికలో స్థానాల ఆధారంగా తొలి సెమీస్ నుంచి టీమిండియా, రెండో సెమీస్ నుంచి దక్షిణాఫ్రికా ఫైనల్ చేరతాయి. ఫైనల్ కూడా పూర్తిగా రిజర్వ్ డేతో సహా వర్షార్పణం అయితే లీగ్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియానే విజేతగా నిలుస్తుంది.