G. Kishan Reddy: మంద కృష్ణ మాదిగ అప్పుడే ప్రధాని మోదీని కలిశారు: ఎస్సీ వర్గీకరణపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- ఎస్సీ వర్గీకరణపై ఏ ప్రధానమంత్రి కూడా సీరియస్‌గా చర్చించలేదన్న కిషన్ రెడ్డి
- ఎస్సీ వర్గీకరణ ఆలస్యం అంశంలో కాంగ్రెస్ మొదటి ముద్దాయి అని ఆరోపణ
- జులైలోనే ప్రధాని మోదీని మంద కృష్ణ మాదిగ కలిసి వివరించారన్న కిషన్ రెడ్డి
ఏ ప్రధానమంత్రి కూడా ఎస్సీ వర్గీకరణపై సీరియస్‌గా చర్చించలేదని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై ఏళ్లుగా శాంతియుత పోరాటం జరుగుతోందన్నారు. ఈ అంశానికి సంబంధించి గత ప్రభుత్వాలు ఎన్నో కమిటీలు వేశాయని, ఏ ప్రధాని కూడా ఎస్సీ వర్గీకరణపై సీరియస్‌గా చర్చించలేదని విమర్శించారు. అన్ని పార్టీలు కూడా కంటితుడుపు చర్యగా ప్రవర్తించాయన్నారు. ఈ అంశంలో మొదటి ముద్దాయి కాంగ్రెస్ అన్నారు. యూపీఏ ప్రభుత్వం తుషార్ మెహతా కమిటీని వేసి, వదిలేసిందన్నారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్... కమిటీ నివేదికను కూడా చదవలేదన్నారు.
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ గత జులై నెలలో ప్రధాని నరేంద్రమోదీని కలిశారని, ఎస్సీ రిజర్వేషన్ అంశంపై చర్చించారన్నారు. అగస్ట్‌లో ఎమ్మార్పీఎస్ నాయకులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడారన్నారు. ఎస్సీ వర్గీకరణపై గతంలో సుప్రీంకోర్టు రెండు రకాల తీర్పులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాలు పరస్పర విరుద్ధ తీర్పులు ఇచ్చాయన్నారు. వర్గీకరణ జరగాలని ఒక ధర్మాసనం, జరగకూడదని మరో ధర్మాసనం తీర్పు చెప్పాయన్నారు. చివరకు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని సుప్రీం చెప్పిందన్నారు.