seethakka: ఏ.. నేను మంత్రిని కావొద్దా..?: ఎమ్మెల్యే సీతక్క

Seethakka Election Speech In Mulugu

  • మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే
  • అగ్గిపెట్టె దొరకని హరీశ్ రావు కారుకూతలు కూస్తున్నాడంటూ ఫైర్
  • బీఆర్ఎస్ నేతలు ఇచ్చే పైసలు తీసుకోండి.. ఓటు మాత్రం నాకే వేయాలని ప్రజలకు విజ్ఞప్తి

ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత సీతక్క మంత్రి హరీశ్ రావుపై మండిపడ్డారు. అగ్గిపెట్టె దొరకని హరీశ్ రావు ఇప్పుడు కారుకూతలు కూస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సీతక్క మంత్రి అవుతుందట’ అంటూ ఎద్దేవా చేస్తున్నాడని విమర్శించారు. ‘ఏ.. నేను మంత్రిని కావొద్దా? నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవద్దా’ అని మంత్రిని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలకు బడుగుబలహీన వర్గాలంటే గిట్టదని సీతక్క ఆరోపించారు.

ములుగులో తనను ఓడించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, కేటీఆర్ లు నియోజకవర్గంలో డబ్బులు వెదజల్లుతున్నారని ఆరోపించారు. నోట్ల కట్టలతో ప్రజలను కొనాలని చూస్తున్నారు కానీ ములుగు ప్రజలు అమ్ముడుపోరనే విషయం వారికి తెలియదన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇచ్చే డబ్బులు తీసుకోవాలని ఓటర్లకు ఆమె సూచించారు. వాళ్లు పంచే డబ్బంతా గత పదేళ్లలో ప్రజల నుంచి దోచుకున్నదేనని చెప్పారు. వారిచ్చే డబ్బులు తీసుకుని ఓటు మాత్రం తనకే వేయాలని విజ్ఞప్తి చేశారు.

ములుగు మండలంలోని కన్నాయిగూడెంలో సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను ప్రజల మనిషినని, ప్రజల కోసం , ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే వ్యక్తినని చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకు కష్టపడుతున్న తనపై ప్రభుత్వానికి ఎందుకింత కక్ష అని సీతక్క నిలదీశారు. కరోనా కాలంలో సేవ చేసినందుకా.. ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకున్నందుకా.. ఎందుకని ప్రశ్నించారు. మంత్రిని కావడం తన కల అని, ప్రజల ఆశీర్వాదం ఉంటే తప్పకుండా మంత్రిని అవుతానని చెప్పారు.

బడుగు బలహీన వర్గాలకు చెందిన నేతలు మంత్రులైతే బీఆర్ఎస్ పార్టీకి గిట్టదని ఆరోపించారు. ఇంకా దొరల చేతిలో బందీలుగానే బతుకుదామా అని ప్రజలను ప్రశ్నించారు. దొరల పాలన కావాలా? లేక ప్రజల వద్దకే పాలన అందించే కాంగ్రెస్ కావాలా? నిర్ణయించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ వాళ్లు డబ్బులను నమ్ముకుంటే తాను మాత్రం మిమ్మల్నే నమ్ముకున్నానని అక్కడి ప్రజలను ఉద్దేశించి చెప్పారు. వాళ్లు గెలిస్తే డబ్బులు గెలిచినట్లు.. తాను గెలిస్తే ములుగు ప్రజలు గెలిచినట్లని సీతక్క పేర్కొన్నారు.

seethakka
Congress
Mulugu MLA
Telangana
Assembly Election
Harish Rao
  • Loading...

More Telugu News