Cricket: నెదర్లాండ్స్‌పై మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ మరో రికార్డ్.. మరో సచిన్ రికార్డ్ సమం
- ఒకే వరల్డ్ కప్‌లో 7 అర్ధ శతకాలు కొట్టిన ఆటగాడిగా సచిన్ సరసన కోహ్లీ
- మరో హాఫ్ సెంచరీ కొడితే సరికొత్త రికార్డ్ సృష్టించనున్న విరాట్
- నెదర్లాండ్స్‌పై 51 పరుగులతో టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచిన ‘రన్ మెషిన్’
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ‘పరుగుల యంత్రం’ విరాట్ కోహ్లీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇటీవలే సచిన్‌తో సమానంగా వన్డేల్లో 49 సెంచరీలు పూర్తి చేసుకున్న విరాట్ తాజాగా మరో సచిన్ రికార్డును సమం చేశాడు. నెదర్లాండ్స్‌పై 51 పరుగులు కొట్టిన కోహ్లీ ప్రస్తుత ప్రపంచ కప్‌లో ఏకంగా 7 అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఒక ప్రపంచ కప్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సరసన విరాట్ చేరాడు. 2003 వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్ మొత్తం 7 హాఫ్ సెంచరీలు కొట్టాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆ రికార్డును ఇప్పుడు కోహ్లీ సమం చేశాడు. ఈ టోర్నీలో విరాట్ మరో అర్ధ సెంచరీ కొడితే ఒక ప్రపంచ కప్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు కొట్టిన ఆటగాడిగా నిలవనున్నాడు. కాగా 2019 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ కూడా 7 సార్లు 50 స్కోర్ నమోదు చేశాడు.
ఇదిలావుండగా ప్రస్తుత వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. నెదర్లాండ్స్‌పై 51 పరుగులతో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడి 594 పరుగులు చేసినట్టయ్యింది. ఇందులో 4 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి. కాగా విరాట్ తర్వాతి స్థానంలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ క్వింటన్ డికాక్(591) ఉన్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు సెమీస్ మ్యాచ్‌లు ఆడనుండడంతో వీరిద్దరిలో ఎవరు టాప్ స్కోరరుగా నిలవనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.