Justin Trudeau: భారత్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కెనడా ప్రధాని ట్రూడో

Canada PM Justin Trudeau once again comments on India
  • కెనడాలో హత్యకు గురైన ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్
  • నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందన్న కెనడా ప్రధాని
  • తీవ్రంగా ఖండించిన భారత్
  • వియన్నా ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందంటూ తాజాగా ట్రూడో వ్యాఖ్యలు
  • పెద్ద దేశాలు చట్టాలు ఉల్లంఘిస్తే ప్రపంచానికి ప్రమాదం అంటూ సూక్తులు
ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడా దేశాల మధ్య తీవ్ర అంతరాన్ని సృష్టించింది. కెనడాలో జరిగిన నిజ్జర్ హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ హత్య వెనుక భారత నిఘా సంస్థ రా ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై భారత్ కూడా అదే స్థాయిలో బదులిచ్చింది. 

నిజ్జర్ హత్య నేపథ్యంలో కెనడా ప్రధాని ట్రూడో భారత్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కెనడా దౌత్య సిబ్బందిని భారత్ వెనక్కి పంపిందని అక్కసు వెళ్లగక్కారు. వియన్నా ఒప్పందాన్ని భారత్ తుంగలో తొక్కిందని విమర్శించారు. కెనడా పౌరుడి హత్యపై విచారణ జరపాలని భారత్ ను కోరామని ట్రూడో అన్నారు. 

పెద్ద దేశాలు చట్టాలు ఉల్లంఘిస్తే ప్రపంచానికి ప్రమాదం అని సూక్తులు వల్లించారు. చట్టాలు ఉల్లంఘించి, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పౌరుడి హత్య తీవ్రమైన అంశమని, దీనిపై చర్చించాలని కెనడా ప్రధాని ట్రూడో అమెరికా తదితర మిత్రపక్షాలను కోరారు.
Justin Trudeau
Canada
Hardeep Singh Nijjar
Murder
India
RAW

More Telugu News