Deepotstav: అయోధ్యలోని సరయూ తీరంలో రికార్డు దీపోత్సవం.. వీడియో ఇదిగో!
- 22 లక్షలకు పైగా దీపాలు వెలిగించిన వాలంటీర్లు
- గిన్నిస్ రికార్డుకెక్కిన దీపోత్సవ వేడుకలు
- డ్రోన్లతో లెక్కించి సర్టిఫికెట్ అందజేసిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు
శ్రీరామ జన్మభూమి అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవం గిన్నిస్ రికార్డులకెక్కింది. ఏకంగా 22 లక్షల దీపాలు వెలిగించి వాలంటీర్లు ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి డ్రోన్లతో పరిశీలించిన గిన్నిస్ ప్రతినిధులు.. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు గిన్నిస్ సర్టిఫికెట్ ను అందజేశారు. దీంతో అయోధ్య వీధివీధినా రామ నామం మార్మోగింది. సరయూ తీరం ఈ రికార్డుకు వేదికయ్యింది.
గడిచిన ఎనిమిదేళ్లుగా దీపావళి సందర్భంగా సరయూ నది తీరంలో దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ప్రపంచ రికార్డు సృష్టించేందుకు యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఐదు నిమిషాల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 25 వేల మంది వాలంటీర్లు శనివారం సాయంత్రం వరుసగా దీపాలను ముట్టించారు. తీరం వెంబడి మొత్తం 51 ఘాట్లలో ముందే ఏర్పాటు చేసిన 24 లక్షల దీపాలలో 22.23 లక్షల దీపాలను వెలిగించారు. గతేడాది 17 లక్షల దీపాలను వెలిగించి దీపోత్సవం నిర్వహించారు.