Palvai Sravanthi: బీఆర్ఎస్ లో చేరిన పాల్వాయి స్రవంతి

palvai sravanthi joined in BRS Party

  • కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్
  • టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ కు రాజీనామా
  • గౌరవంలేని చోట ఉండొద్దని తన తండ్రి చెప్పారని వ్యాఖ్య

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ పాల్వాయి స్రవంతి గులాబీ కండువా కప్పుకున్నారు. మునుగోడు నియోజకవర్గ టికెట్ ఆశించిన పాల్వాయి స్రవంతికి కాంగ్రెస్ పార్టీ మొండిచేయి చూపించింది. టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన స్రవంతి.. శనివారం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆదివారం ఉదయం తెలంగాణ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ.. గౌరవం లేని చోట ఉండొద్దని అప్పట్లో తన తండ్రి చెప్పేవారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు తగిన గౌరవం ఇవ్వడంలేదని, పార్టీ కోసం సంవత్సరాల తరబడి కష్టపడిన వారిని గుర్తించకుండా కొత్తగా పార్టీలో చేరిన వారిని అందలం ఎక్కిస్తున్నారని మండిపడ్డారు. అందుకే తనకు గౌరవం ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ లోకి రావడం సంతోషంగా ఉందన్న స్రవంతి.. పదవుల కోసం బీఆర్ఎస్ లో చేరలేదని స్పష్టం చేశారు. తనతో పాటు తన కార్యకర్తల భవిష్యత్తును మంత్రి కేటీఆర్ చేతుల్లో పెడుతున్నట్లు వివరించారు.

అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి కేవలం కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, రాష్ట్రంలో మరోమారు కేసీఆర్ సర్కారే ఏర్పడుతుందని చెప్పారు. యాదగిరి గుట్ట గతంలో ఎలా ఉందో ఇప్పుడెలా మారిందో అందరికీ తెలిసిందేనని చెప్పారు. పాల్వాయి స్రవంతి చేరికను బీఆర్ఎస్ తరఫున స్వాగతిస్తున్నట్లు చెప్పారు. పార్టీలోకి నేతలు ఎప్పుడైనా రావచ్చు.. ఎప్పుడైనా వెళ్లొచ్చనే తీరులో కాంగ్రెస్ పార్టీ విధానం ఉంటుందని విమర్శించారు.

Palvai Sravanthi
BRS
KTR
Congress
Telangana Bhavan
KCR
Yadadri
Munugode
Telangana Assembly Election

More Telugu News