Odisha: ఒడిశాలో మహాభారత కాలం నాటి ‘రథ చక్రం’ లభ్యం..స్థానికుల పూజలు!
- ఖండ్మల్ జిల్లా పురన్‌షాహీ గ్రామంలోని ఖడగ్ నదీ తీరంలో రథ చక్రం గుర్తింపు
- నదిలో స్నానానికి వెళ్లిన వ్యక్తి కంట పడిన రథ చక్రం
- అర్జునుడి రథ చక్రం నదిలో ఉన్నట్టు ఇటీవల తనకు కల వచ్చిందన్న వ్యక్తి
- భక్తిశ్రద్ధలతో చక్రానికి స్థానికుల పూజలు
ఒడిశాలోని ఖండ్మల్ జిల్లా పురణ్‌షాహీ గ్రామంలోని ఖడగ్ నదిలో ఓ రథ చక్రం లభించడం స్థానికంగా సంచలనానికి దారి తీసింది. అది అర్జునుడి రథ చక్రమని నమ్ముతున్న స్థానికులు తండోపతండాలుగా తరలివచ్చి చక్రానికి పూజ చేసి వెళుతున్నారు. చక్రం లభించిన నదీ తీరాన్ని అర్జున్‌ఘాట్‌గా పిలుస్తారు. కానీ ఆ పేరు ఎలా వచ్చిందో తమకు ఇప్పటికీ తెలియదని అక్కడి వారు చెబుతుండటం గమనార్హం.
నదిలో స్నానానికి వెళ్లిన స్థానికుడు సుమంతా నాయక్‌కు ఈ చక్రం కనిపించింది. అర్జునుడి రథ చక్రం అక్కడ ఉన్నట్టు నాలుగు రోజుల క్రితమే తనకు కల వచ్చిందని అతడు చెప్పడం సంచలనానికి దారితీసింది. ‘‘అర్జున్‌ఘాట్ వద్ద నాకీ చక్రం దొరికింది. మహాభారత కాలంలో అర్జునుడు అధిరోహించిన రథ చక్రం ఇదేనని మేం బలంగా నమ్ముతున్నాం’’ అని అతడు చెప్పుకొచ్చాడు.
చక్రం ఆకారంలో మధ్యలో చిల్లుతో ఉన్న ఈ రాయిని చూసేందుకు ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిశోధకులు పురణ్‌షాహీ గ్రామానికి తరలివస్తున్నారు. అయితే, పురావస్తు శాఖ అధికారులు వచ్చి రాయి పూర్వాపరాలు చెబితేనే ఈ మిస్టరీకి ముగింపు పడుతుందని స్థానిక జర్నలిస్టు ఒకరు వ్యాఖ్యానించారు.