Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు

CM KCR extends deepawali greetings

  • చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అన్న కేసీఆర్
  • దీపాల వెలుగులు మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తాయన్న కేసీఆర్
  • తెలంగాణ ప్రజలపై లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని, ప్రతి ఇల్లు సిరిసంపదలతో విరాజిల్లాలని కోరుకున్న కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటామని, చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ అని అన్నారు. దీపావళికి హిందూ సంస్కృతిలో విశేషమైన ప్రాశస్త్యమున్నదన్నారు. జీవానికి సంకేతమైన అగ్ని కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించి నూతనోత్తేజంతో ముందడుగు వేసేలా ప్రేరణనిస్తాయని పేర్కొన్నారు.

మనలో అంతర్‌జ్యోతి వెలిగినప్పుడే జీవితంపై స్పష్టత ఏర్పడి ప్రతి రోజు పండుగలా ఆవిష్కృతమవుతుందన్నారు. మనం పయనించే ప్రగతిపథంలో అడుగడుగునా అడ్డుపడే నరకాసురుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. ప్రజల సంక్షేమాన్ని కోరి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పటాకులు కాలుస్తూ దీపావళి పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఉండాలనీ, ప్రతి ఇల్లు సకలశుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News