Vladimir Putin: ప్రియురాలిని కసిదీరా పొడిచి చంపిన యువకుడికి పుతిన్ క్షమాభిక్ష... ఎందుకంటే...!
- ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడులు
- జైళ్లలో ఉన్న ఖైదీలకు కూడా యుద్ధ విధులు
- యుద్ధం చేసేందుకు ఆసక్తిగా ఉన్న ఖైదీల విడుదల
- ప్రేయసిపై అత్యాచారం చేసి 111 కత్తిపోట్లు పొడిచిన కాన్యుస్
- కాన్యుస్ ను కూడా విడుదల చేసిన రష్యా ప్రభుత్వం
- పుతిన్ నిర్ణయం పట్ల రష్యా వ్యాప్తంగా ఆగ్రహావేశాలు
రష్యా కొన్నాళ్లుగా ఉక్రెయిన్ పై సైనిక దాడులు నిర్వహిస్తోంది. సైన్యంతో పాటు వాగ్నర్ గ్రూప్, జైళ్లలో ఉన్న ఖైదీలను కూడా రష్యా యుద్ధం కోసం వినియోగిస్తోంది. ఖైదీల్లో తుపాకీ పట్టుకోగల సామర్థ్యం ఉన్నవారిని గుర్తించి వారిని యుద్ధరంగంలోకి పంపుతోంది.
రష్యా ప్రభుత్వ నిర్ణయంతో యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టినవారిలో వ్లాదిస్లావ్ కాన్యుస్ ఒకడు. అతడు తన ప్రియురాలిని హత్య చేసిన కేసులో 17 ఏళ్ల జైలుశిక్షకు గురయ్యాడు. యుద్ధంలో దేశం కోసం పోరాడేందుకు సంసిద్ధత చూపడంతో అతడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్షమాభిక్ష ప్రకటించారు. దాంతో అతడు శిక్ష పడిన ఏడాదికే జైలు నుంచి విడులదయ్యాడు.
అయితే, పుతిన్ నిర్ణయం తీవ్ర విమర్శలపాలైంది. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇంతకీ కాన్యుస్ చేసిన నేరం ఏమిటో తెలిస్తే అతడెంత క్రూరుడో అర్థమవుతుంది. కాన్యుస్ ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇరువురు కొంతకాలం పాటు సన్నిహితంగా ఉన్నారు. అయితే, ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పడంతో కాన్యుస్ భరించలేకపోయాడు. ఆ యువతిపై తీవ్రస్థాయిలో కసి పెంచుకున్న ఆ యువకుడు దారుణమైన రీతిలో అంతమొందించాడు.
తొలుత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం మూడున్నర గంటల పాటు క్రూరంగా హింసించాడు. ఈ క్రమంలో ఆమెను 111 సార్లు కత్తితో పొడిచి చంపాడు. కేవలం బ్రేకప్ చెప్పిందన్న కారణంతో ఈ ఘోరానికి పాల్పడ్డాడు. అలాంటి కిరాతకుడికి క్షమాభిక్ష పెట్టడం సరైన నిర్ణయమేనా అంటూ పుతిన్ ను మహిళా హక్కుల కార్యకర్తలు నిలదీస్తున్నారు.
కాగా, సైనిక దుస్తుల్లో తుపాకీ చేతబట్టి ఉన్న కాన్యుస్ ఫొటోలు చూసి మృతురాలి తల్లి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది చూస్తే తన కుమార్తె ఆత్మ క్షోభిస్తుందని తెలిపారు. ఏ చట్ట ప్రకారం అతడికి క్షమాభిక్ష పెట్టారని ఆ మాతృమూర్తి ఎలుగెత్తారు. పాలకులే ఇలా ఉంటే ఏం చేయాలో అర్థం కావడంలేదని ఆమె నిస్సహాయత వ్యక్తం చేశారు.